- రోడ్డు పక్కన కుప్పలుగా పేరుకుపోతున్న చెట్ల కొమ్మలు
- విద్యుత్ శాఖ కాంట్రాక్టర్లదే తరలించే బాధ్యత
హైదరాబాద్, వెలుగు:వర్షాలు, ఈదురు గాలలకు కూలిన చెట్లను బల్దియా డీఆర్‌ఎఫ్ బలగాలు వెంటవెంటనే తొలగిస్తున్నాయి. అర్బన్ బయో డైవర్సిటీ అధికారులు, పారిశుద్ధ్య విభాగం దీనికోసం చర్యలు తీసుకుంటున్నాయి. ఈ సీజన్‌లో నగర వ్యాప్తంగా సుమారు 150 చెట్లు పడిపోగా మాన్‌సూన్ బృందాలు తొలగించాయి. అయితే సిటీలో చాలా చోట్ల చెట్ల కొమ్మలు ఎండిపోయి రోడ్డు పక్కన కుప్పలుగా కనిపిస్తున్నాయి. కరెంటు వైర్లకు తగులుతున్నాయన్న కారణంతో విద్యుత్‌శాఖ అధికారులు కూడా సిబ్బందితో చెట్ల కొమ్మలు కొట్టేపిస్తున్నారు. వాటిని తొలగించకుండా వదిలేయడంతో రోడ్డు పక్కనే ఎండిపోయి వ్యర్థాలుగా మారుతున్నాయి. జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖల మధ్య సమన్వయం లేకనే ఇట్లా జరుగుతున్నట్టు తెలుస్తోంది. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం తలనొప్పిగా మారిందని బల్దియాలోని ఓ అడిషనల్ కమిషనర్ వ్యాఖ్యానించారు. కరెంటు తీగలకు అడ్డుగా ఉన్న చెట్లు, కొమ్మలను నరికేసి చేతులు దులుపుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలానికి నెల రోజుల ముందు నుంచే మెయిన్‌రోడ్లు, అంతర్గత రహదారుల వెంట స్తంభాలు, తీగలకు ఆనుకుని ఉన్న చెట్ల కొమ్మలను విద్యుత్‌శాఖ కట్ చేయించింది. వాటిని తరలించాల్సిన కాంట్రాక్టర్‌తో పట్టించుకోకపోవడంతోనే ఇదంతా జరుగుతున్న తెలుస్తోంది.
తొలగించకుంటే ఫైన్
వర్షానికి పడిపోయిన చెట్ల తొలగింపు బాధ్యతను జోనల్ లెవల్‌లో అర్బన్ బయో డైవర్సిటీ, పారిశుద్ధ్య, డీఆర్‌ఎఫ్ బలగాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. చెట్టు పడిపోయిందని జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్‌కు సమాచారం రాగానే స్థానికంగా ఉన్న మాన్‌సూన్ యాక్షన్ టీమ్‌లు రంగంలోకి దిగుతాయి. విద్యుత్ శాఖలో మాత్రం ప్రత్యేకంగా కాంట్రాక్టర్‌కు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కరెంటు తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి, తరలించాల్సి ఉంటుందని విద్యుత్‌శాఖ అధికారి తెలిపారు. ఎక్కడైనా కాంట్రాక్టర్ తొలగించడకుండా రోడ్లపై పడేస్తే జరిమానా విధించే నిబంధన కూడా ఉందన్నారు. ఇకపై దీనిపై దృష్టి సారిస్తామని చెప్పారు.