కేఎల్​ఐ కెనాల్​కు చెట్లు అడ్డమచ్చినయట!

కేఎల్​ఐ కెనాల్​కు చెట్లు అడ్డమచ్చినయట!
  • రూ.5 లక్షల పరిహారం చెల్లించక మూడేండ్లుగా పనులు బంద్​
  • 60 వేల ఎకరాలకు అందని సాగునీరు
  • బీఆర్ఎస్​ జమానాలో పాలమూరు ప్రాజెక్టులపై నిర్లక్ష్యానికి ఇదో పరాకాష్ఠ

నాగర్​ కర్నూల్​.వెలుగు:  కాల్వా.. కాల్వా.. ఎందుకు ఆగినవంటే చెట్లు అడ్డమచ్చినయ్​ అన్నదట! 210 టేకుచెట్లకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చేందుకు ఆఫీసర్లు ససేమిరా అనడంతో ఓ రైతు కాల్వ పనులు అడ్డుకున్నాడు. దీంతో కెనాల్​ నిర్మాణానికి బ్రేక్​ పడి మూడేండ్లుగా 60 వేల ఎకరాలకు నీళ్లందడం లేదు.  ఇరిగేషన్​కు పెద్దపీట వేశామని గొప్పలు చెప్పుకున్న నాటి బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో పాలమూరు ప్రాజెక్టులపై కొనసాగిన వివక్షకు ఇదో నిదర్శనం.  కృష్ణా నదిపై చేపట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్​ స్కీం పరిధిలోని 29వ ప్యాకేజీలో భాగంగా నాగర్​కర్నూల్​జిల్లా కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి నుంచి మాడ్గుల మండలం నాగిళ్ల వరకు 58 కిలోమీటర్ల  (టెయిల్​ఎండ్​ డిస్టిబ్యూటర్​)​ కెనాల్​  నిర్మాణానికి 2018లో బీఆర్ఎస్ సర్కారు రూ.300 కోట్లు కేటాయించింది. వెల్దండ, ఆమనగల్లు, మాడ్గుల మండలాల పరిధిలో 60వేల ఎకరాలకు సాగునీరందించాల్సిన ఈ కెనాల్​ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, నిర్మాణ పనులకు నిధులను సకాలంలో విడుదల చేయడంలో నాటి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. జంగారెడ్డిపల్లి నుంచి వెల్డండ మండలం చెర్కూర్​ గ్రామశివారు వరకు కాలువ నిర్మాణం ఎలాగోలా పూర్తయినా అక్కడి నుంచి  ముందుకు కదలలేదు.

అడ్డం పడిన టేకు చెట్లు..

వెల్దండ మండలం చెర్కూర్ గ్రామ శివారులో కెనాల్​ తవ్వకానికి మొదట అటవీ భూములు అడ్డుపడ్డాయి. 300 మీటర్ల పొడవునా అడవి మధ్యలోంచి కాల్వ నిర్మాణానికి  అటవీశాఖ నుంచి క్లియరెన్స్ కు రెండేండ్ల  టైం పట్టింది. ఈ సమస్య పరిష్కారం అయ్యిందనుకునే లోపే  చెర్కూర్ శివారులోని ఒక రైతు పొలంలో 120 టేకు చెట్లు కెనాల్ ​నిర్మాణానికి అడ్డువచ్చాయి. వాటికి ఎస్టిమేట్​ వేసిన ఆఫీసర్లు రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి పరిహారం రాకపోవడంతో పనులను రైతు అడ్డుకున్నాడు. ఆఫీసర్లు నచ్చజెప్పినా రైతు ససేమిరా అనడంతో కెనాల్​ వర్క్స్​ నిలిచిపోయాయి. ఆ తర్వాత 58 కిలోమీటర్లు తవ్వాల్సిన కెనాల్​ నిర్మాణానికి బ్రేక్​పడినట్లయింది. నాటి ప్రజాప్రతినిధులుగానీ, ఆఫీసర్లుగానీ  ప్రభుత్వం నుంచి రూ.5లక్షలు ఇప్పించలేకపోవడంతో 60వేల ఎకరాలు సాగునీటికి నోచుకోని పరిస్థితి వచ్చింది.

పరిహారం అందితేనే కాల్వ పనులు..

డి- 82 కెనాల్ ​కింద పోతున్న భూములు నాగర్​ కర్నూల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోకి వస్తాయి.  నాగర్​ కర్నూల్ ​జిల్లాలో కల్వకుర్తి, వెల్డండ, చారకొండ, వంగూరు మండలాలు, రంగారెడ్డి జిల్లాలో ఆమనగల్​, మాడ్గుల మండలాల పరిధిలో దాదాపు 450 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇందుకు రూ. 38 కోట్లు అవసరం అవుతాయని ఇరిగేషన్​ ఆఫీసర్లు ప్రపోజల్స్​ రెడీ చేశారు. ఇందుకు సంబంధించి 2020లోనే టోకెన్లు ఇచ్చిన ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించేందుకు అనుమతి ఇవ్వలేదు.

నాగర్​ కర్నూల్​ జిల్లాలోని 60మంది రైతులకు రూ.20 కోట్లు, రంగారెడ్డి జల్లాలోని 150 మంది రైతులకు  రూ.18 కోట్లు చెల్లించాల్సి  ఉంది. కాగా, రంగారెడ్డి జిల్లాలో 150 మంది రైతులకు చెల్లించాల్సిన రూ.18 కోట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్​ పీడీ అకౌంట్​లో జమ య్యాయి. కానీ, ఈ జిల్లాలో భూ సేకరణ విభాగం లేకపోవడంతో సాంకేతిక సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటే తప్ప కెనాల్​ నిర్మాణం సాధ్యం కాదని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.