అమ్రాబాద్, వెలుగు: నల్లమలలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా దోమలపెంట నుంచి అక్కమహాదేవి గుహలకు ట్రెక్కింగ్, సఫారీ సేవలను సోమవారం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభిస్తారు. ఈ స్టే ప్యాకేజీలో భాగంగా దోమలపెంట నుంచి వటవర్లపల్లి మార్గంలో సఫారీకి ఫారెస్ట్ ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. 25 కిలోమీటర్ల దూరం ఉన్న అక్కమహాదేవి గుహలకు దోమలపెంట నుంచి సఫారీ వెహికల్ లో బయలుదేరి మార్గమధ్యలో అడవిలో సుడులు తిరుగుతూ ప్రవహించే కృష్ణమ్మ అందాలను తిలకించవచ్చు.
5 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ ఉంటుంది. అక్కడి నుంచి అక్కమహాదేవి గుహలు సందర్శించి గుహలో ఉన్న శివలింగాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణం ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులకు పర్యాటక అనుభూతిని పరిచయం చేయడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు తెలిపారు.