T20 World Cup 2024: ఇదే నా చివరి టీ20 వరల్డ్ కప్.. న్యూజిలాండ్ క్రికెట్‌కు షాక్ ఇచ్చిన స్టార్ పేసర్

T20 World Cup 2024: ఇదే నా చివరి టీ20 వరల్డ్ కప్.. న్యూజిలాండ్ క్రికెట్‌కు షాక్ ఇచ్చిన స్టార్ పేసర్

న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బోల్ట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ తన కెరీర్ లో చివరిదని వెల్లడించాడు. ఉగాండాపై అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకున్న ఈ లెఫ్టర్మ్ పేసర్.. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తన నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేశాడు. ఈ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ కు ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. జూన్ 17న పపువా న్యూ గునియాతో జరగనున్న ఈ మ్యాచ్ బోల్ట్ ప్రపంచ కప్ కెరీర్ లో చివరిది. 

వరల్డ్ కప్ 2024లో కివీస్ జట్టు వరుసగా ఓడిపోతున్నా.. బోల్ట్ మాత్రం అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఆడిన మూడు మ్యాచ్ ల్లో 7 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఉగాండాపై శనివారం(జూన్ 15) జరిగిన మ్యాచ్ లో తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. మొత్తం నాలుగు ఓవర్ల స్పెల్ వేసిన బోల్ట్ 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అంతకముందు వెస్టిండీస్ పై జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో 16 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. 

2011లో బోల్ట్ న్యూజిలాండ్ తరుపున అరంగేట్రం చేశాడు. దశాబ్ద కాలంగా కివీస్ జట్టులో కీలక బౌలర్ గా రాణించాడు. కివీస్ తరపున తొలిసారి 2014లో ఈ 34 ఏళ్ళ ఫాస్ట్ బౌలర్ వరల్డ్ కప్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 5 టీ20 వరల్డ్ కప్ లో బోల్ట్ కివీస్ తరపున ఆడాడు. ప్రపంచవ్యాప్తంగా T20 ఫ్రాంచైజీ క్రికెట్‌ను ఆడాలనే నిర్ణయాన్ని బోల్ట్ తెలియజేశాడు. తన కెరీర్ లో 60 టీ20 మ్యాచ్ ల్లో 81 వికెట్లు పడగొట్టాడు.