
హైదరాబాద్: ఐపీఎల్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు కొట్టిన ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మపై ఆ జట్టు పేసర్ ట్రెంట్ బౌల్ట్ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అన్న బౌల్ట్.. ముంబై ఇండియన్స్ ఆరో టైటిల్ నెగ్గే ప్రయాణంలో అతను కీలక పాత్ర పోషించనున్నాడని నమ్మకం వ్యక్తం చేశాడు. బుధవారం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన బౌల్ట్ ప్లేయర్ ఆఫ్‌ద మ్యాచ్‌గా నిలిచాడు.
ఈ పోరులో ముంబై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం తన జట్టు పెర్ఫామెన్స్ గురించి బౌల్ట్ మాట్లాడాడు. ‘ముంబై ఇండియన్స్ జట్టులో చాలా మంది వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. అందులో రోహిత్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జట్టు విజయంలో వేర్వేరు దశల్లో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తున్నారు. కానీ, రోహిత్ సరైన సమయంలో తన కర్తవ్యాన్ని అద్భుతంగా నెరవేరుస్తున్నాడు.
మిగిలిన సీజన్‌లో మా జట్టులో తను కీలక పాత్ర పోషించనున్నాడు’ అని బౌల్ట్ చెప్పాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని కూడా బౌల్ట్ మెచ్చుకున్నాడు. ‘హార్దిక్ గ్రేట్ లీడర్. తను జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. తను మంచి కమ్యూనికేటర్ కూడా. తాను చెప్పాలనుకున్నది స్పష్టంగా వివరిస్తాడు. ఇండియా క్రికెటర్లలో అతను నా ఫేవరెట్. అతని నేతృత్వంలో ఆడడం గొప్ప అనుభవం’ అని బౌల్ట్ పేర్కొన్నాడు.