యాదాద్రిలో స్పెషల్​ దర్శన క్యూలైన్ల ట్రయల్​రన్ .. నేటి నుంచే అమలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం స్పెషల్​దర్శన క్యూలైన్లను సోమవారం నుంచి అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు వీఐపీ టికెట్లు కొన్న భక్తులను తూర్పు రాజగోపురం నుంచి డైరెక్టుగా ఆలయంలోకి అనుమతించేవారు. వారికి ప్రత్యేక క్యూలైన్లు ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఉన్న ధర్మదర్శన లైన్లను రెండుగా విభజించారు. 

ఆదివారం సాయంత్రం ట్రయల్ నిర్వహించారు. రూ.150 వీఐపీ టికెట్లు కొన్న వారిని బస్ బే ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎంట్రన్స్ నుంచి క్యూలైన్లలోకి పంపించారు.  ఈ సందర్భంగా పలువురు భక్తులు..ఆలయ ఆఫీసర్లు, ఎస్పీఎఫ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దర్శనం తొందరగా అవుతుందని రూ.150 పెట్టి టికెట్ కొంటే ఉచిత దర్శన  లైన్లను రెండుగా చేసి అందులోంచి తమను పంపడం ఏమిటని నిలదీశారు. ఇప్పటికే ఇరుకుగా ఉన్న ధర్మదర్శన క్యూలైన్ల మధ్య గ్రిల్స్ ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని సాధారణ భక్తులు వాపోయారు.