
- అభివృద్ధి నినాదంతో సతీశ్
- బీసీ ఓట్లపై పొన్నం ఆశలు
- స్థానిక నినాదంతో బీజేపీ అభ్యర్థి శ్రీరామ్ చక్రవర్తి యత్నం
సిద్దిపేట, వెలుగు : హుస్నాబాద్ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ నెలకొంది. అభివృద్ధి నినాదంతో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్ కుమార్ తీవ్రంగా ప్రచారం చేస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థి పొన్న ప్రభాకర్ బీసీ ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. అలాగే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీరామ్ చక్రవర్తి .. స్థానిక నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలతో కలుపుకుని మొత్తం 19 మంది హుస్నాబాద్ బరిలో నిలిచారు. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నెలకొంది.
అభివృద్ధి మంత్రం... లక్ష మెజార్టీ కోసం ప్రయత్నం
హుస్నాబాద్ నుంచి మూడోసారి రంగంలోకి దిగిన ఒడితెల సతీశ్ కుమార్ ప్రభుత్వ అభివృద్ధి మంత్రంతో లక్ష మెజారిటీ సాధించి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. రెండు నెలల క్రితమే బీఆర్ఎస్ అభ్యర్థిగా తన పేరు ప్రకటించడంతో నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. సీఎం కేసీఆర్ సెంటిమెంట్ ప్రకారం నెల రోజుల క్రితమే హుస్నాబాద్ లో ప్రజాఆశీర్వాద సభ నిర్వహించి ప్రచార శంఖారావాన్ని పూరించారు. సౌమ్యునిగా పేరున్న సతీశ్ కు ప్రజల్లో మంచి ఇమేజ్ ఉండడం సానుకూలాంశమైనా ఆశించిన మేర అభివృద్ది చేయలేదనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. దళిత బంధు, బీసీ బంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు, గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలు ఆయనకు వ్యతిరేకాంశాలుగా మారాయి.అలాగే బీఆర్ఎస్ కు చెందిన నియోజకవర్గ నేతలు సైతం కాంగ్రెస్ లో చేరుతుండడం ఆయనకు మైనస్ గా మారింది.
బీసీ నినాదంతో పొన్నం
అనూహ్యంగా హుస్నాబాద్ బరిలో దిగిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో కరీనంనగర్ నుంచి పోటీ చేసినపుడు హుస్నాబాద్ లో దాదాపు 40 వేల ఓట్లు పొందిన ఆయన.. ప్రభుత్వ వ్యతిరేకత, బీసీ వర్గాల ఓట్లపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఉద్యమ నాయకుడిగా ప్రజల్లోకి వెళుతూ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే సమయంలో తాను చేసిన క్రియాశీలక పాత్రను ప్రజలకు వివరిస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే కాంగ్రెస్ ఆరు గ్యారంటీ స్కీమ్ లపై వివరిస్తున్నారు. ఆయన రాకతో పోటీ ఇప్పుడు రసవత్తరంగా మారింది. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి స్థానికంగా ఉంటూ ప్రచారం చేస్తున్నారు. హుస్నాబాద్ టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని బుజ్జగించి తన వైపు తిప్పుకోవడంలో సఫలమయ్యారు. తన ప్రచార కార్యక్రమాల్లో అల్గిరెడ్డిని కూడా వెంట తీసుకెళ్తూ పార్టీ ఐక్యంగా ఉందనే సంకేతాలు పంపారు. దీనికి తోడు నియోజవర్గంలో దాదాపు పదివేల ఓట్లున్న సీపీఐతో పొత్తు పొన్నంకు సానుకూలాంశంగా మారింది. సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి సైతం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు నియోజకవర్గం లో దళిత బంధు, బీసీ బంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగం, గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలు వంటి అంశాలు పొన్నంకు సానుకూలాంశంగా ఉన్నాయి.
స్థానికతతో ముందుకు
హుస్నాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా తొలిసారి బరిలోకి దిగిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి.. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. తనకు ఆలస్యంగా టికెట్ ఖరారు కావడంతో నామినేషన్ వేసిన మరుక్షణమే బీజెపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తో రోడ్ షో ను నిర్వహించి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన బొమ్మ వెంకటేశ్వర్లు వారసుడిగా హుస్నాబాద్ బరిలోకి దిగానని, తనను ఆశీర్వదించాలని ఓటర్లను ఆయన కోరుతున్నారు. చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి స్థానికుడిగా హుస్నాబాద్ ప్రజలతో సత్సంబంధాలు కలిగిన శ్రీరాం చక్రవర్తి అనూహ్యంగా బీజేపీలో చేరి టికెట్ పొందారు. పార్టీ మారినా ప్రజలతో తనకున్న సత్సంబంధాలు కలిసి వస్తాయని ఆయన భావిస్తున్నారు. బండి సంజయ్ సహకారం, ప్రధాని నరేంద్ర మోదీ కరిష్మా తనకు సానుకూలంగా మారుతాయని భావిస్తున్నారు. అలాగే దశాబ్ద కాలంగా నియోజకవర్గంలో అభివృద్ధి మందగించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందకపోవడం, గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలను ఆయన తన ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నారు.
నిర్ణయాత్మక శక్తిగా బీసీ ఓటర్లు
హుస్నాబాద్ నియోజకవర్గంలో బీసీ ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లా పరిధిలో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, కరీనంగనర్ జిల్లా పరిధిలో చిగురుమామిడి, సైదాపూర్, హన్మకొండ జిల్లా పరిధిలో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు ఉన్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,42,187 ఓటర్లలో పురుషులు 1,19,763 కాగా, మహిళలు 1,22,415 మంది ఉన్నారు. మొత్తం ఓటర్ల లో దాదాపు యాభై శాతం కంటే ఎక్కువగా బీసీ ఓటర్లు ఉన్నారు. అందులో గౌడ సామాజిక వర్గం ఓట్లు దాదాపు 25 వేల పైచిలుకు ఉన్నాయి. తరువాత స్థానంలో మున్నూరు కాపు, ముదిరాజ్, పద్మశాలి ఓట్లు ఉన్నాయి.