పట్నంపై పట్టు ఎవరిది? .. ఇబ్రహీంపట్నం సెగ్మెంట్​లో ట్రయాంగిల్ ఫైట్ 

హైదరాబాద్, వెలుగు: గ్రామీణ, పట్టణ ఓటర్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి అయినా విజయం సాధించాలంటే ఆ  రెండు ప్రాంతాల ఓటర్లను ఆకట్టుకోవాలి. సెగ్మెంట్ పరిధిలో యాచారం, మంచాల, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం, పాత హయత్​నగర్​, పెద్ద అంబర్​పేట మండలాలు  ఉన్నాయి. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్​మెట్​, హయత్​నగర్ ​మున్సిపాలిటీలు ఉండగా.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఓటర్ల ప్రభావం అభ్యర్థి గెలుపోటములపై ఎక్కువగా ఉంటుంది.

హయత్​నగర్​, అబ్దుల్లాపూర్​మెట్, తుర్కయాంజాల్, పెద్ద​అంబర్​పేట మున్సిపాలిటీలుగా మారాయి. తుర్కయాంజాల్, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్​మెట్​వంటి ప్రాంతాల్లో కొంత ముస్లిం ఓటర్లు, దళిత ఓటర్లు ఎక్కువగానే ఉంటారు. దీంతో అభ్యర్థుల గెలుపోటములపై వీరి ప్రభావం పడుతుంది. యాచారం, మంచాల, పాత హయత్​నగర్​ప్రాంతాల్లో మధ్యతరగతి ఓటర్లు  అధికంగా ఉన్నారు.  ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్ సిట్టింగ్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి,బీజేపీ నుంచి దయానంద్​గౌడ్ పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. 

 పథకాలే గెలిపిస్తాయని మంచిరెడ్డి ధీమా 

ఇక్కడి నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంచిరెడ్డి కిషన్​రెడ్డి మరోసారి విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలతో లబ్ధిపొందినవారు ఓటు వేస్తారని భావిస్తున్నారు. రాజకీయ అనుభవం కూడా తనకు కలిసి వచ్చే అంశాలని పేర్కొంటున్నారు. మైనస్​లను చూస్తే.. పథకాలు పొందనివారు.. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నవారంతా ఓటు వేస్తారా? అనేది ప్రశ్నగా ఉంది. మంచి రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా కొంతనష్టం కలిగించే అవకాశం ఉంది. 

కాంగ్రెస్ ​హవా అంటున్న మల్ రెడ్డి 

2018లో కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకపోగా.. మల్​రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ నుంచి పోటీ చేసి 376 ఓట్లతో ఓటమి చెందారు. ఈసారి కాంగ్రెస్ నుంచి టికెట్​రావడంతో పోటీలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్​కు ప్రజల్లో ఆదరణ పెరిగిపోగా తన గెలుపునకు ఢోకాలేదని భావిస్తున్నారు. బీఆర్ఎస్​ ప్రభుత్వ వైఫల్యాలు అనుకూలించే అంశాలని ఆయన అంటున్నారు. కాంగ్రెస్​ ప్రకటించిన ఆరు గ్యారంటీలు కూడా తన విజయాన్ని అందిస్తాయన్నారు. రంగారెడ్డికి మైనస్​లను చూస్తే.. గతంలో టీడీపీ, బీఎస్పీ పార్టీల్లో  కొనసాగిన ఆయన 1994లో ఒకసారి, తర్వాత 2004లో మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. అప్పట్లో ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. 

ALSO READ : కేసీఆర్​ పాలనలో అవినీతి, అణచివేత: మాయావతి

దయానంద్ ​గౌడ్ ​పాట్లు  

సెగ్మెంట్​లో బీజేపీ అభ్యర్థి దయానంద్​గౌడ్​ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే .. ఆ పార్టీకి పెద్దగా  పట్టులేకపోవడం ఆయనకు కొంత మైనస్​గానే చెప్పొచ్చు. పార్టీకి క్యాడర్​ పెద్దగా లేకపోవడం కూడా నష్టమే. బీఆర్ఎస్​ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్​పై ప్రజల్లో ఆదరణ లేదనే వాదనతో  ఆయన ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు.