సెగ్మెంట్ రివ్యూ.. వరంగల్‍ తూర్పులో ట్రయాంగిల్ ఫైట్

  •   ప్రతి క్యాండిడేట్‍కు మిగతా ఇద్దరితో పాత వైరం 
  •     అధికార పార్టీ తరఫున నన్నపునేని నరేందర్‍
  •     కాంగ్రెస్‍ నుంచి సురేఖ, బీజేపీ నుంచి ప్రదీప్ రావు

వరంగల్‍, వెలుగు : ఓరుగల్లు నియోజకవర్గంలో అన్ని చోట్ల ఇద్దరు అభ్యర్థుల మధ్యే పోటీ ఉండగా.. సిటీ పరిధిలోని వరంగల్‍  తూర్పు నియోజకవర్గంలో మాత్రం మూడు ప్రధాన పార్టీల క్యాండిడేట్ల మధ్య పోటీ తీవ్రంగా నడుస్తోంది. అధికార బీఆర్‍ఎస్‍  నుంచి సిట్టింగ్‍ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍ బరిలో ఉండగా.. కాంగ్రెస్‍ తరపున మాజీ మంత్రి కొండా సురేఖ, బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్‍రావు పోటీలో ఉన్నారు.

ఈ ముగ్గురు అభ్యర్థులు ఎప్పటి నుంచో పాము, ముంగిసలా ఒకరికొకరు శత్రువులుగా ఉన్నారు. ఎన్నోసార్లు వ్యక్తిగత సవాళ్లు, దూషణలు చేసుకున్నారు. కొండా సురేఖ దంపతులు, ఎర్రబెల్లి ప్రదీప్‍ రావు గతంలో బీఆర్‍ఎస్‍ లో పనిచేయగా.. హైకమాండ్‍, లోకల్‍ ఎమ్మెల్యే తీరు నచ్చక బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. ఇప్పుడు అదే పార్టీ అభ్యర్థి నరేందర్‍ పై పోటీ చేస్తున్నారు.

నరేందర్‍ వర్సెస్‍ కొండా, ఎర్రబెల్లి

రాజకీయాల్లో సిట్టింగ్‍ ఎమ్మెల్యే నరేందర్‍..  కొండా సురేఖ, ఎర్రబెల్లి ప్రదీప్ రావు కన్నా చాలా జూనియర్‍. ఈ ఇద్దరి సహకారంతోనే రాజకీయంగా ఆయన ఎదిగారు. టీడీపీలో సీనియర్‍గా ఎర్రబెల్లి దయాకర్‍రావు ఉన్నపుడు ఆయన మద్దతుతో నరేందర్‍  టీడీపీ అర్బన్‍ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత గ్రేటర్‍ మేయర్‍, తూర్పు ఎమ్మెల్యే అయ్యారు. కొండా దంపతులు బీఆర్‍ఎస్‍లో ఉన్నప్పుడు నరేందర్‍  వారికి దగ్గరగా మెదిలాడు. తర్వాత దయాకర్‍ రావు బీఆర్‍ఎస్‍లో చేరడంతో కొండా దంపతులు బీఆర్‍ఎస్‍ను వీడారు. కాగా, అప్పటివరకు సీనియర్ గా ఉన్న కొండా దంపతులను నన్నపునేని శత్రువుగా చూడడం మొదలుపెట్టారు. తాను ఎమ్మెల్యే అయ్యాక వారిపై వ్యక్తిగత దూషణలకు దిగారు.

వివిధ కార్యక్రమాలకు హాజరయ్యే టైంలో ఎన్నోసార్లు ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే తూర్పు నుంచి గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రదీప్ రావు పోటీచేసి మంచి ఓట్లు సాధించారు. తర్వాత బీఆర్‍ఎస్‍ లో చేరారు. అయితే.. నరేందర్‍ మొదటి నుంచి ప్రదీప్ రావును శత్రువుగా చూశారు. సొంత పార్టీ నేత అయినప్పటికీ కార్పొరేటర్లు, క్యాడర్‍ ఎవరూ ప్రదీప్ రావు వద్దకు వెళ్లకుండా కట్టడి చేశారు. ఆయన వర్గంపై పోలీసు కేసులు పెట్టించారనే అపవాదు మూటగట్టుకున్నారు. మొత్తంగా నరేందర్‍  పోరు భరించలేక ప్రదీప్ రావు బీజేపీలో చేరారు. అప్పటి నుంచి నన్నపునేని మరింత జోష్‍  పెంచారు. పబ్లిక్‍ మీటింగ్‍, ప్రెస్‍మీట్లలో ఎన్నోసార్లు వ్యక్తిగతంగా ప్రదీప్ పై దుమ్మెత్తి పోశారు. 

నన్నపునేని గతం మరిచి మాట్లాడుతున్నడు: కొండా

ఎర్రబెల్లి దయాకర్‍రావు, కొండా దంపతుల మధ్య 30 ఏండ్లుగా శత్రుత్వం నడుస్తోంది. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉంటే వారు తమ ఆధిపత్యం చూపే ప్రయత్నం చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు దయాకర్ రావు కావాలనే కొండా మురళిని అరెస్టు చేయించారని ఆరోపణలు ఉన్నాయి. ఎర్రబెల్లి నుంచి ఇబ్బందులు రావొద్దనే ఉద్దేశంతోనే నాడు దివంగత సీఎం వైఎస్‍ రాజశేఖర్ రెడ్డి మనుషులకు దగ్గరయ్యారు.

వైఎస్  ప్రభుత్వంలో ఆయన భార్య సురేఖ మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో వారికి దయాకర్ రావు సోదరునిగా ప్రదీప్ రావుతో కూడా అంతే గ్యాప్‍  వచ్చింది. ఇక తాము సహకారం అందిస్తేనే నరేందర్‍ కార్పొరేటర్‍గా, మేయర్‍గా, ఎమ్మెల్యేగా ఎదిగారనేది కొండా దంపతుల వాదన. తమను కలిసేందుకు తమ ఇంటి గేటు ముందు నిలబడ్డ వ్యక్తి.. ఈరోజు గతాన్ని మరిచి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని కొండా దంపతులు మండిపడుతున్నారు. 

ఎవరి ఇమేజ్‍ వారిదే.. ఎవరి బలం వారిదే

వరంగల్‍ తూర్పు నుంచి నరేందర్‍, సురేఖ, ప్రదీప్ రావు రాజకీయంగానే కాకుండా వ్యక్తిగత శత్రువులుగా ఎన్నికల బరిలో ఢీ అంటే ఢీ అంటున్నారు. నియోజకవర్గంలో పద్మశాలి, కాపు, ఎస్సీ, ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండగా వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ముగ్గురు క్యాండిడేట్లు నియోజకవర్గంలో సొంత ఇమేజ్‍  సంపాదించుకున్నవారే. తనకు నియోజకవర్గంలో పార్టీ నుంచి సహకారం లేకున్నా, వెంట నడిచిన వారు పార్టీ వీడుతున్నా తనకున్న అనుభవంతో నరేందర్  ఒంటరి పోరు చేస్తున్నారు.

ద్వితీయ శ్రేణి నేతలను నయానో భయానో తనతో నడిచేలా చేస్తున్నారు. డబుల్‍  బెడ్రూం ఇండ్లు నిర్మాణమైన నేపథ్యంలో తనను గెలిపిస్తే మీకే అవకాశమంటూ ఆ నేతలకు ఆశ చూపుతున్నారు. ఇక కొండా దంపతులు గతంలో తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో నాటి క్యాడర్‍ను తిరిగి తమ గూటికి తెస్తున్నారు. కాంగ్రెస్‍  హవాను క్యాష్‍ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నాళ్లు బీఆర్‍ఎస్‍  ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలను తమ వైపు తిప్పుకుంటున్నారు. సురేఖ భర్త మురళీ గెలుపే లక్ష్యంగా గ్రౌండ్‍ వర్క్  చేస్తున్నారు. కాంగ్రెస్  నేత రాహుల్ గాంధీ రాకతో క్యాడర్‍లో మరింత జోష్‍ వచ్చింది. ఈ ఇద్దరితో పోలీస్తే బీజేపీ అభ్యర్థి ప్రదీప్ రావుకు సౌమ్యుడిగా పేరుంది. జనాలు తనను సులభంగా కలిసేలా చూసుకుంటారు. యూత్‍ లో, ఓటర్లలో ఆయనకు మంచి ఇమేజ్‍  ఉంది. ముస్లిం ఓటర్లు బీజేపీ అంటే కొంత వ్యతిరేకత చూపే అవకాశమున్నా మిగతా ఇద్దరు వాటిని చీల్చే క్రమంలో తనకు ఇబ్బంది ఉండదని ప్రదీప్  భావిస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్‍  విషయంలో కేంద్రంలోని మోదీ సర్కారు అనుకూలంగా ఉండడంతో ఎస్సీ ఓట్లు తనకు లాభం చేకూరుస్తాయనే ధీమాతో ఉన్నారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్‍ షా ప్రచారానికి వచ్చివెళ్లగా జనసేన అధ్యక్షుడు పవన్‍  కల్యాణ్‍, ఎంఆర్‍పీఎస్‍ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వస్తే తన విజయం ఖాయంఅవుతుందని ఆయన భావిస్తున్నారు. 

తూర్పు బీఆర్‍ఎస్‍ పార్టీలో నరేందర్‍ ఒంటరి

కేసీఆర్‍  సర్కారు వ్యతిరేకతకు తోడు సిట్టింగ్‍ ఎమ్మెల్యేగా నరేందర్‍కు నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోంది. తూర్పు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్‍ లో పెద్ద లీడర్లు ఉన్నా నరేందర్‍  ఒంటరి అయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, గ్రేటర్‍  మేయర్‍  గుండు సుధారాణి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, రోడ్లు భవనాల అభివృద్ధి సంస్థ చైర్మన్‍  మెట్టు శ్రీనివాస్‍  వంటి నేతలు ఉన్నా ఏ ఒక్కరూ నరేందర్‍తో కలిసి నడవట్లేదు.

ALSO READ : దర్బార్ మేధావులారా..ఆలోచించండి

ఎక్కడో ఉండే పక్క నియోజకవర్గాల్లో ప్రచారాలకు వెళ్తున్నారు తప్పితే నరేందర్‍  కోసం వెళ్లడం లేదు. ఇన్నాళ్లు నరేందర్  వెంట నడిచిన పలువురు అధికార కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు బీఆర్‍ఎస్‍కు రాజీనామా చేసి కాంగ్రెస్‍ లో చేరారు. మాజీ మేయర్‍  గుండా ప్రకాశ్ రావు సైతం పార్టీని వీడారు. దీంతో నన్నపునేని నరేందర్‍  అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరు చేస్తున్నారు.