- అభివృద్ధి జపంతో జనంలోకి బీఆర్ఎస్ అభ్యర్థి
- ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ క్యాండిడేట్ ప్రచారం
- ప్రజా సమస్యలు, బీసీ కార్డుతో బరిలోకి బీజేపీ అభ్యర్థి
జగిత్యాల, వెలుగు : జగిత్యాల నియోజకవర్గంలో ట్రైయాంగిల్ వార్ సాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బీజేపీ అభ్యర్థిగా మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బోగ శ్రావణి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ జరగగా బీఆర్ఎస్ గెలుపొందింది. బీజేపీకి కొన్ని ఓట్లే వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో బీజేపీ నుంచి బీఆర్ఎస్ అసమ్మతి నేత బోగ శ్రావణికి టికెట్ దక్కడంతో పోరు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య నెలకొంది. ఈ పోరులో ఎవరి ఓట్లను ఎవరు చీలుస్తారు, ఎవరు ఓటమి పాలవుతారు, ఎవరు గెలుస్తారోనని ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. తమను ఇబ్బంది పెట్టే పార్టీల నుంచి కీలక నేతలకు గాలం వేస్తూ చేరికలను ప్రోత్సహిస్తుండడంతో నియోజకవర్గంలో రోజురోజుకు పొలిటికల్ హీట్ పెరుగుతోంది.
డెవలప్ మెంట్ తో ఓటర్ల వద్దకు బీఆర్ఎస్
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ 60 వేలకు పైగా మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పై గెలుపొందారు. అధికార పార్టీ సంక్షేమ పథకాలతో పాటు కంటి వైద్యుడిగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉచిత కంటి అపరేషన్లు చేయడం సంజయ్ కు కలిసి వస్తుందని బీఆర్ఎస్ క్యాడర్ ఆశిస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా 4500 డబుల్ బెడ్రూం ఇండ్లు జగిత్యాల మున్సిపాలిటీలో మంజూరు చేయడంతో పాటు వాటిని పూర్తిచేసి లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీ, మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటుపై సంజయ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ రమణ, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పాటు బలమైన క్యాడర్ ను ఆయన నమ్ముకున్నారు.
ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం
గత ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రతిపక్షంలో బలమైన నేత లేకపోవడంతో తమ గొంతుకగా విద్యావంతులు జీవన్ రెడ్డిని గెలిపించడం లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత కాంగ్రెస్ వేవ్ కు తోడు ఆరు గ్యారంటీలు, ప్రజా వ్యతిరేకతపై జీవన్ రెడ్డి నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ ప్రజల మధ్య ఉంటున్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి పసుపు కుంకుమ కింద తులం బంగారం ఇస్తామన్న హామీని పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. అలాగే కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గంలో పొలాస వ్యవసాయ విశ్వవిద్యాలయం, న్యాక్ సెంటర్, జేఎన్టీయూ, ఇందిరమ్మ ఇండ్లు వంటి అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఓట్లు అడుగుతున్నారు.
బీసీ కార్డు పై బీజేపీ ఆశలు
జగిత్యాల నియోజకవర్గంలో తొలిసారి బీసీ మహిళకు బీజేపీ టికెట్ కేటాయించింది. టికెట్ దక్కించుకున్న బోగ శ్రావణి.. ప్రజా సమస్యలతో పాటు బీసీలపై అగ్ర వర్ణాల అణచివేత అంశాన్ని అస్త్రంగా చేసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తప్పిదాలను ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బీసీ సీఎం అంశంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో 20 వేలకుపైగా ఓట్లు ఉన్న పద్మశాలి సామాజికవర్గం నుంచి రావడం ఆమెకు కలిసి వస్తుందని పార్టీ క్యాడర్ భావిస్తోంది. బీఆర్ఎస్ లో మున్సిపల్ చైర్ పర్సన్ గా తనపై చూపిన వివక్షను మహిళలకు వివరిస్తూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు శ్రావణి. దీనికి తోడు బలమైన యూత్ క్యాడర్ తో ప్రచారంలో ముందంజలో ఉంటూ ఒక్కసారి ఆడబిడ్డకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను ఆమె కోరుతున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి బలాలు
- ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కంటి వైద్యుడిగా మంచి గుర్తింపు, ప్రతి గ్రామం లో ఉచిత కంటి అపరేషన్ల లబ్ధిదారులు ఉండడం
- జగిత్యాల అర్బన్ లో 4,500 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, మెడికల్, కాలేజీ, మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు
- భూదందాలు, కబ్జాలు, కమీషన్లు వంటి ఆరోపణలు లేకపోవడం
- బలమైన క్యాడర్. సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఉండడం
బలహీనతలు
- మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బోగ శ్రావణి బీజేపీలో చేరి పోటీ చేయడం
- కింది స్థాయి క్యాడర్ నుంచి వ్యతిరేకత
- ముక్కుసూటితనంతో ఇబ్బందులు
బీజేపీ అభ్యర్థి బలాలు
- బీఆర్ఎస్ నుంచి మున్సిపల్ చైర్ పర్సన్ గా పనిచేసిన అనుభవం
- పద్మశాలి సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడం
- తొలి బీసీ మహిళా అభ్యర్థి, యూత్ క్యాడర్ బలంగా ఉండడం.
బలహీనతలు
- మున్సిపల్ చైర్ పర్సన్ గా పనిచేసినపుడు కుటుంబ సభ్యుల భూదందాలపై ఆరోపణలు
- ఆమె హయాంలో రెండు సార్లు ఏసీబీ సోదాలు జరగడం
- బలమైన పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమణ బీఆర్ఎస్లో ఉండడం.