గిరిజన రిజర్వేషన్లు పెంచాల్సిందే

తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్ శాతం పెంచాలని 33 గిరిజన తెగలు ఆందోళన చేస్తున్నాయి. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉన్న 6 శాతం రిజర్వేషనే ఇప్పటికీ అమలవుతోంది. రిజర్వేషన్ల శాతం పెంచకపోవడంతో గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోంది. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్​ అమలు చేస్తామని, 3 ఎకరాల భూమి ఇస్తామని సీఎం కేసీఆర్​అనేక సార్లు హామీ ఇచ్చారు. ఆయన మాటలు నమ్మిన గిరిజనులు టీఆర్ఎస్​ పార్టీకి ఓటు వేసి గెలిపించారు. రిజర్వేషన్ల శాతం పెరుగుతుందని, గిరిజనుల బతుకులు మారుతాయని మురిసిపోయారు. కానీ ఇచ్చిన హామీలు అటు ఉంచి, మేనిఫెస్టోలో చెప్పిన వాటిని కూడా సీఎం కేసీఆర్​అమలు చేయడం లేదు. దీంతో గిరిజనులకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్16(4) ప్రకారం రాష్ట్రంలో దళితులు, గిరిజనులు ఎంత శాతం ఉంటారో వారి జనాభా అంత శాతం రిజర్వేషన్ పెంచుకోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అది అమలు కావడం లేదు. గిరిజనుల ఆర్థిక వనరులు, వారి సమస్యలపై అధ్యయనం కోసం చెల్లప్ప కమిటీని నియమించిన ప్రభుత్వం. దాని పేరుతో కాలయాపన చేసింది. రెండేండ్లపాటు అధ్యయనం చేసిన కమిటీ.. వాల్మీకి, బోయ, కాయితీ లభానీ(బీసీ లను)ఎస్టీ జాబితాలో చేర్చాలని సూచించింది. రాష్ట్ర పరిధిలో ఉన్న గిరిజన రిజర్వేషన్ల శాతం పెంచకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. దీనివల్ల ఎనిమిదేండ్ల పాటు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలు, అభివృద్ధిలో గిరిజనులు తీవ్రంగా నష్టపోయారు. నాలుగు శాతం రిజర్వేషన్​కింద వచ్చే అవకాశాలు కోల్పోయారు. ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదు. గిరిజనులు ఎన్నో ఆందోళనలు, పోరాటాలు చేస్తున్నా..  రాష్ట్ర ప్రభుత్వం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోంది. ఆర్టికల్16(4) ప్రకారం తెలంగాణలో 9.34 శాతం గిరిజన రిజర్వేషన్లు పెంచుకోవచ్చని హైకోర్టు 2015లో తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పక్కన పెట్టింది. 

 4 శాతం రిజర్వేషన్లు నష్టపోతున్నరు..

2015లో తెలుగు సంక్షేమ భవన్​లో ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ పీఏసీ సమావేశం జరిగింది. అప్పుడు గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో గిరిజనులకు10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తీర్మానం జరిగింది. ఆ తీర్మానం కూడా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. గిరిజనులకు10 శాతం రిజర్వేషన్ పెంచుతున్నామని ప్రభుత్వం కూడా అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసింది. ఆ తీర్మానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ పెంచుతామని చెప్పింది. అందులోనే వాల్మీకి, బోయ, కాయితీ, లభానీలను గిరిజన జాబితాలో చేరుస్తామని పేర్కొంది. బీసీలకు 37 శాతం. ఎస్టీలకు10 శాతం, ఎస్సీలకు15 శాతం, ఈడబ్ల్యూఎస్ 10 శాతం మొత్తం 72 శాతానికి రిజర్వేషన్ పెంచే విధంగా కేంద్రానికి కాగితం పంపించింది. కానీ అవేమీ అమలు జరగలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల తెలంగాణలో గిరిజనులు ఇప్పటికీ నాలుగు శాతం రిజర్వేషన్లు నష్టపోవాల్సి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. గిరిజన రిజర్వేషన్లు 10 శాతానికి పెంచడం ద్వారా చాలా మంది పేద గిరిజన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ప్రభుత్వం దీన్ని వెంటనే పరిష్కరించపోతే ఈ తాజా ఉద్యోగాల్లో కూడా గిరిజనులకు నష్టం జరిగే ప్రమాదముంది.

9.08 శాతం జనాభా..

తెలంగాణలో సమగ్ర సర్వే సందర్భంగా గిరిజన జనాభాను లెక్కించగా.. రాష్ట్రంలో 9.98 శాతం ఉన్నట్లు తేలింది. అయితే 2021లో జనాభా లెక్కలు నిర్వహించలేదు. కాబట్టి 9.08 శాతం రిజర్వేషన్​అమలు చేయాలని కొంతమంది ఆలోచన చేస్తున్నారు. అయితే అది గిరిజనులు చేసిన తప్పు ఏమాత్రం కాదు. 2021 జనాభా లెక్కల ప్రకారం గిరిజనులకు10 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో గిరిజనులకు10 శాతం వరకు రిజర్వేషన్​ పెంచాలని, అందుకు ప్రత్యేక తీర్మానం చేసి పంపాలని రాష్ట్రానికి సూచించాలి. ఇప్పటికైనా గిరిజనుల రిజర్వేషన్ ప్రక్రియ ఎక్కడ ఆగిందో పరిశీలించి తక్షణమే పదిశాతం రిజర్వేషన్ పెంపు దిశగా ప్రభుత్వం ముందుకు కదలాలి. 

పెంచకుంటే పోరాటమే..

రాష్ట్రంలో ఉన్న గిరిజన ఎమ్మెల్యేలు, ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ సమావేశం మరోసారి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.10 శాతం రిజర్వేషన్ పెంపు కోసం తమ వంతు కర్తవ్యాన్ని పూర్తి చేయాలి. తెలంగాణలో గిరిజనులకు10 శాతం రిజర్వేషన్ అమలు జరిగే వరకు కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రామ పంచాయతీల్లో సభలు, సమావేశాలు నిర్వహించి గిరిజనులను చైతన్య పరుస్తం. గిరిజన సంఘం ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ లాంటి కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది. ఈ పోరాటంలో  తెలంగాణలో ఉన్న ప్రజలు, మేధావులు, నేతలను భాగస్వాములను చేస్తం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గిరిజన బిడ్డలకు న్యాయం చేయాలి.

10 శాతం రిజర్వేషన్ ​పెరగకపోతే..

తెలంగాణ ప్రభుత్వం 16 ఏప్రిల్​ 2017 న అసెంబ్లీలో తీర్మానం చేసిన ఎస్టీ రిజర్వేషన్ బిల్లులో అనేక లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌16(4) ప్రకారం ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్‌ శాతం పెంచే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్‌ 10 శాతం రిజర్వేషన్‌ అమలుకు లేని ఆటంకం గిరిజనుల విషయంలో ఎందుకు ఉంటుంది? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్ల శాతం పెంచేందుకు ప్రత్యేకంగా మరోసారి తీర్మానం చేసి జీవో జారీ చేయాలి. ఎన్టీ రామారావు 127 జీవో ప్రకారం 4 శాతం ఉన్న రిజర్వేషన్లను 6 శాతానికి పెంచారు. రాష్ట్ర సీఎం కూడా దాన్ని పది శాతానికి పెంచాల్సిన అవసరం ఉంది. అవసరమైతే రాష్ట్ర సర్కారు కేంద్రంపైనా ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్ సాధించి గిరిజనుల పట్ల ఉన్న చిత్త శుద్ధిని నిరూపించుకోవాలి. లేదంటే రాష్ట్రంలో ఉన్న గిరిజన సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలను కలుపుకొని పోరాటం చేసి రిజర్వేషన్లు సాధించుకుంటాం.

:: మూడ్ ధర్మ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ గిరిజన సంఘం