గిరిజనుల భూములను లాక్కోవడం దుర్మార్గం

గిరిజనుల భూములను లాక్కోవడం దుర్మార్గం
  • గిరిజన రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి
  •  గిరిజన సంఘాల ఐకాస డిమాండ్

ముషీరాబాద్, వెలుగు : కొడంగల్​లో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం గిరిజనుల భూములు లాక్కోవడం దుర్మార్గమని రాష్ట్ర గిరిజన సంఘాల ఐకాస మండిపడింది. పోలీసులు గిరిజన రైతులపై అక్రమ కేసులు బనాయించారని, వెంటనే ఎత్తివేయాలని డిమాండ్​చేసింది. వ్యవసాయ భూములను ఫార్మా కంపెనీలకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించింది. గురువారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సేవాలాల్ సేన, లంబాడీ హక్కుల పోరాట సంఘం, గిరిజన ఐకాసా, పౌర హక్కుల సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు భూక్య సంజీవ్ నాయక్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం గిరిజనుల భూములను బలవంతంగా లాక్కోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలోని గిరిజనులంతా ఏకమై, నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి ‘చలో కొడంగల్’ నిర్వహిస్తామన్నారు. వాస్తవాలు తెలుసుకునేందుకు పోలీసులు సహకరించాలని కోరారు.

ఐకాస ప్రతినిధులు రాంబాబు నాయక్, గణేశ్​నాయక్, సంపత్ నాయక్, కల్యాణ్ నాయక్, ప్రవీణ్ నాయక్, రాజు నాయక్, హరినాయక్, భీమ్ నాయక్, రాథోడ్ తుకారం తదితరులు పాల్గొన్నారు.