ఇండియా అథ్లెటిక్స్ క్యాంపునకు గిరిజన బిడ్డ

ఇండియా అథ్లెటిక్స్ క్యాంపునకు గిరిజన బిడ్డ

భద్రాచలం, వెలుగు :  త్వరలో జరిగే అథ్లెటిక్స్ పోటీల కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఐదు క్యాంపుల్లో భోపాల్​ క్యాంపునకు భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం గిరిజన గురుకులం పదవ తరగతి విద్యార్థిని పడిగె ఇందూ ఎంకైయ్యారు.  ఇటీవల రాజస్థాన్​లో జరిగిన నేషనల్​అథ్లెటిక్స్ మీట్​లో పాల్గొని 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు పరుగుపందెం, షాట్​పుట్​, లాంగ్​జంప్​, హైజంప్​, డిస్క్ త్రో క్రీడాంశాల్లో మెడల్స్ సాధించింది. దీంతో ఆమెను ఎన్​ఐడీజేఏఎం-24కు ఎంపిక చేశారు. అండర్-14 విభాగంలో ఇందూను తీసుకున్నారు. 

15 రోజుల పాటు జరిగే ఈ కోచింగ్​కు ఆమె భోపాల్​కు బయలుదేరి వెళ్లింది. ఈఎం ఆర్​ఎస్​ జాతీయ క్రీడల్లో ఛాంపియన్​గా, ఇంటర్ సొసైటీ లీగ్​ పోటీల్లో అండర్ -14 విభాగంలో వ్యక్తిగత ఓవరాల్ ఛాంపియన్​షిప్​ను సాధించింది. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్లె గ్రామానికి చెందిన ఈ గిరిజన బిడ్డ ఇండియా అథ్లెటిక్స్ క్యాంపునకు ఎంపిక కావడం పట్ల ఐటీడీఏ పీవో రాహుల్​, గురుకులం ఆర్​సీవో వెంకటేశ్వరరాజు హర్షం వ్యక్తం చేశారు.