
హుస్నాబాద్, వెలుగు : తండాల తండ్లాట పోవాలంటే దొరలను గద్దె దించాలని మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి సూచించారు. బీఆర్ఎస్ దొరల పాలనలో గిరిజన తండాలు సమస్యలతో తల్లడిల్లుతున్నాయని ఆరోపించారు. గురువారం అక్కన్నపేటలో చేటపట్టిన ‘పల్లెపల్లెకు ప్రవీణన్న.. గడపగడపకు కాంగ్రెస్’ యాత్రలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అహంకార, అసమర్థ పాలనతో హుస్నాబాద్ నియోజక వర్గంలో మారుమూల గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయన్నారు. తండాల్లో కనీస వసతుల్లేవని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిందని గుర్తు చేశారు. ప్రజల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే రాజభోగాలు అనుభవిస్తోందని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ను తెలంగాణ లో లేకుండా చేయాలన్నారు. రాజ్యాంగం ప్రకారం పాలించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. ఆయన వెంట టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి, సొసైటీ చైర్మన్ శివయ్య, పార్టీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య, సర్పంచులు ముత్యాల సంజీవరెడ్డి, బద్ధం రాజిరెడ్డి పాల్గొన్నారు.