భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏటా నవంబరు 15న బిర్సా ముండా జయంతిని గిరిజన ఆత్మగౌరవ దినోత్సవంగా నిర్వహించుకోవాలని ప్రకటించింది. ఈ నిర్ణయం చరిత్రాత్మకమైనది. స్వయం సమృద్ధ భారతం స్ఫూర్తితో అంతర్జాతీయ వేదికలపై మన దేశ స్థానాన్ని మరింత పటిష్టం చేసే గిరిజన సంప్రదాయం, వారసత్వం, సంస్కృతులు, దేశం సాధించిన విజయాలను ప్రధాని తీసుకున్న నిర్ణయం ప్రతిబింబిస్తుంది. “ప్రస్తుత స్వాతంత్ర్య అమృత కాలంలో భారతదేశ గిరిజన వారసత్వం, సంప్రదాయాలు, వీరగాథలకు మరింత గణనీయ, ఉదాత్త గుర్తింపునివ్వాలని దేశం నిర్ణయించింది” అని ప్రధాని మోడీ ప్రకటించడం హర్షణీయం. ప్రపంచంలోని విభిన్న జాతుల జనాభాలో దాదాపు 25 శాతం భారతదేశంలోనే ఉంది. అందుకే ఇది విభిన్న, ఉజ్వల సాంస్కృతిక వారసత్వం గల దేశం. భారత్ పెద్ద సంఖ్యలో యువ గిరిజనం గల దేశం కూడా. విద్య, క్రీడలు తదితర రంగాల్లో అందుబాటులో గల అవకాశాలను వారు చురుగ్గా వాడుకుంటున్నారు. వారి అంకితభావం, నిబద్ధతతో ప్రసిద్ధ ‘పద్మ’ పురస్కారాలు సహా అంతర్జాతీయ గుర్తింపును కూడా సాధించుకుంటున్నారు.
ఆదివాసీలు సహజ ప్రతిభగల వారైనప్పటికీ వారి విషయంలో గత ప్రభుత్వాల పూర్తి నిర్లక్ష్యం, ఉదాసీనత ఫలితంగా తమ హక్కుల కోసం వారు సుదీర్ఘకాలం పోరాడాల్సి వచ్చింది. కానీ, నేడు మన క్రియాశీల ప్రధాని నాయకత్వంలో ఎట్టకేలకు వారి పరిస్థితులు ఆశావహంగా మారాయి. దేశంలోని షెడ్యూల్డ్ తెగల అపార సామర్థ్యానికి నిదర్శనంగా తొలి గిరిజన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉదాహరణగా పేర్కొనడానికి ఇది అద్భుతమైన సందర్భం. ఈ విశిష్ట పదవికి ఆమె ఎంపికే గిరిజనంపై మోడీ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. ఎనిమిదేళ్ల సుపరిపాలనలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక్కొక్కటిగా, బహుముఖంగా పరిష్కారం లభిస్తున్నది. “సబ్ కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్.. సబ్‌కా ప్రయాస్” నినాదానికి నిజమైన అర్థం కనిపిస్తున్నది.
గిరిజనులకు సంపూర్ణ విద్య
ప్రజా ప్రాధాన్య విధానం గల ప్రభుత్వం దిశగా భారతదేశం నేడు ఒక విప్లవాత్మక మార్పును చూసింది. “సంస్కరణ, సామర్థ్యం, పరివర్తన” దిశగా ప్రధానమంత్రి పిలుపు ఎనిమిదేళ్లుగా ప్రభుత్వానికి ఒక మార్గదర్శక సూత్రంగా పనిచేస్తున్నది. చిట్టచివరి వ్యక్తికీ ప్రయోజనాలు అందేవిధంగా భరోసా ఇవ్వడంతో పాటు దేశవ్యాప్తంగా అభివృద్ధి ఫలితాల మెరుగు కోసం ప్రజాహిత విధానాలు, -కార్యక్రమాలు అమల్లోకి తెస్తున్న విషయం గమనార్హం. ఇవన్నీ మౌలిక సదుపాయాల పెంపు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల విస్తరణ, రైతు సంక్షేమ పరిరక్షణ, బలహీనులకు రక్షణ, వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చాయి. అంతేగాక వృద్ధిరీత్యా కూడా యువశక్తి నాయకత్వం, సాంకేతికత చోదితంగా దేశం గణనీయ ప్రగతిని సాధించింది. నా అనుభవాల రీత్యా మన వందేళ్ల ఉజ్వల స్వతంత్ర భారతం గురించి ఊహించుకుంటే- అందుకు గిరిజన సమాజ సమగ్రాభివృద్ధి సాధన కీలకమని నేను గ్రహించాను. ఆ క్రమంలో గిరిజనుల జీవన ప్రమాణాల పెంపు, వ్యవస్థాగతంగా ముఖ్యమైన సమస్యల పరిష్కారం, వారి సాంస్కృతిక వారసత్వానికి విలువనిస్తూ ప్రధాన జీవన స్రవంతిలోకి తేవడం అత్యావశ్యకమని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను.
ప్రగతి సాధనకు అత్యంత కీలక వ్యూహం సంపూర్ణ విద్యేనని మన ప్రధానమంత్రి ప్రతిపాదించారు. ఏదైనా సమాజం లేదా జాతి లేదా దేశం సానుకూల రీతిలో ముందంజ వేయాలన్నా, అవసరమైన సంస్కరణలు చేపట్టాలన్నా, భవిష్యత్ సంకల్ప సాధనలో విజయవంతం కావాలన్నా శక్తిమంతమైన ఉపకరణం ఇదేనని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ మేరకు గిరిజన వారసత్వ పరిరక్షణలో భాగంగా సంప్రదాయ, సాంస్కృతిక ఆచారాలను కాపాడుకుంటూనే పాలనా విధానాలకు పునాది అయిన విద్యపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించింది. గిరిజన సమాజాలలో.. ముఖ్యంగా యువతుల కోసం విద్యాభ్యాస సంప్రదాయాన్ని ప్రోత్సహించడం అత్యావశ్యకం. వామపక్ష తీవ్రవాద ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో విద్యా మౌలిక సదుపాయాల కల్పనకు సవాళ్లుండేవి. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడం ద్వారా ఈ సవాళ్లను అధిగమించడం మా లక్ష్యం. ఆ మేరకు వారు ఉత్తమ ఏకలవ్య, ఆదర్శ, ఆశ్రమ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తారు. దీంతో పాటు మేమందించే ఐదు ఉపకార వేతన పథకాల ప్రయోజనం కూడా వారికి లభిస్తున్నది. ఈ మేరకు ‘ప్రీ/పోస్ట్ మెట్రిక్, నేషనల్ ఫెలోషిప్, టాప్ క్లాస్ స్కాలర్‌షిప్, నేషనల్ ఓవర్సీస్స్కాలర్‌షిప్’ వంటివి దేశంలోని గిరిజన విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.
పరిశోధన- నైపుణ్య సంస్థలతో ఎదుగుదల
ప్రపంచం డిజిటల్ శకంలోకి వెళ్తున్న నేపథ్యంలో గిరిజన సంక్షేమాన్ని వేగిరపరిచేందుకు, సుపరిపాలన అనుసరణకు వీలుగా మా మంత్రిత్వశాఖ తాజా సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకుంటున్నది. గిరిజన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో ఈ కృషి పునాదిగా మారింది. ఆదివాసీలకు డిజిటల్ సాధికారత కల్పన, మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికీ నైపుణ్యం పెంపుతోపాటు వారు తయారు చేయగల వస్తువుల ఉత్పత్తి నుంచి విక్రయానికి తోడ్పాటు అందించడం దాకా ఈ కృషి దోహదం చేస్తున్నది. మరోవైపు మన రాష్ట్రాల గిరిజన పరిశోధన సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, నైపుణ్య కేంద్రాలు, ఇతర అనుబంధ సమూహాలు తదితరాలన్నీ గిరిజన జీవన-సంస్కృతి సహా అందులోని మానవశాస్త్ర సంబంధ అంశాలపైనా దృష్టి పెడుతున్నాయి. ఈ సంస్థలు కీలకపాత్ర నిర్వహించాల్సి ఉండటంతో పాటు పరిశోధన, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో అవి సహాయపడాల్సి ఉంటుంది.
సంస్కృతి, విద్య, ఆరోగ్యం, ఉపాధికి ప్రాధాన్యత
2047 నాటికి భారత్నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ఆర్థిక సంక్షేమంలో కొత్త శిఖరాలకు చేరడం, నగరాలు, -గ్రామాల్లో విశిష్ట సౌకర్యాల కల్పన, ప్రపంచంలో అత్యంత అధునాతన మౌలిక సదుపాయాల నిర్మాణం తదితరాలు కీలకమైనవి. ఆ మేరకు 2047 దార్శనిక నిర్దేశంలో ప్రధానమైన ఈ అంశంపై కృషి ఊపందుకోవాలి. తదనుగుణంగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సుస్థిర జీవనోపాధి, ఆదాయార్జన, విద్య, ఆరోగ్యం, విభిన్న గిరిజన తెగల సంస్కృతిని ప్రోత్సహించడం లాంటి వాటికి ప్రాధాన్యమిచ్చింది. మా ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, పథకాల ఫలితంగా ఇవాళ గిరిజనం మరింతగా సమాజంతో మమేకమవుతున్నది. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ దేశంలోని అనేక గిరిజన భాషల సంరక్షణకు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా గిరిజన భాషలకు లిపిని అభివృద్ధి చేయడానికి విద్యా సంస్థలు, నిపుణులతో కలిసి శ్రమిస్తున్నది. గిరిజనుల జీవితాల్లో ప్రత్యక్ష, పరోక్ష అంశాలు రెండింటిపైనా గిరిజన మంత్రిత్వశాఖ సమదృష్టి కలిగి ఉందని నేను సగర్వంగా చెప్పగలను. అంతేగాక మా కార్యక్రమాలు, విధానాలు స్థానిక పాలక సంస్థలతో సమన్వయం ద్వారా జాతీయ దృక్పథంతో ముందుకు నడుస్తున్నాయి. దీర్ఘకాలంలో ఈ ‘నా భారతదేశం’ సుస్థిర అభివృద్ధిలో అగ్రగామిగా, బలమైన సామాజిక-, ఆర్థిక పునాదులతో, పౌరులందరికీ విస్తృత అవకాశాలను కల్పిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. దేశం ఇవాళ తన గళాన్ని గట్టిగా వినిపించగల శక్తియుక్తంగా ఎదగడం, ప్రపంచ దేశాలతో సమాన స్థాయి భాగస్వామిగా నిలవడమనే లక్ష్యాలవైపు నిదానంగానే అయినా ముందడుగు వేస్తున్నది. విభిన్న అభివృద్ధి కార్యక్రమాల ద్వారా భారతదేశ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసేందుకు, సుసంపన్న -ప్రజా నేతృత్వంలోగల దేశ నిర్మాణానికి మనమిప్పుడు చేయికలిపి పయనం ప్రారంభించాం.
- అర్జున్ ముండా, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి