సోలార్ తో సాగు సక్సెస్​

సోలార్ తో సాగు సక్సెస్​
  • సోలార్​ కరెంట్​తో బీడు భూములను సాగులోకి తెస్తున్న గిరిజనులు 
  • ఆరేండ్ల కింద త్రీఫేస్​ కరెంట్​ లేని ప్రాంతాల్లో సోలార్​ మోటార్లు ఇచ్చిన ప్రభుత్వం
  • వందల ఎకరాల్లో ఏడాదికి రెండు పంటలు పండిస్తున్న రైతులు 
  • కొత్త ప్రాంతాల్లో మరిన్ని మోటార్లు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తామంటున్న గిరిజనులు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని మారుమూల ఏజెన్సీ గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేదు.. త్రీఫేస్​ కరెంట్​జాడలేదు. కానీ గిరిజనులు ఏడాదికి రెండు పంటలు సాగు చేస్తూ  అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆరేండ్ల కిందట గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన సోలార్​ మోటార్లతో బీడు భూములను సాగు భూములుగా మార్చడంలో వారు సక్సెస్ ​అయ్యారు. మరిన్ని త్రీఫేస్ ​కరెంట్​సప్లై లేని ప్రాంతాల్లో సోలార్​మోటార్లను ఇస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామని గిరిజనులు పేర్కొంటున్నారు. 

ఒక్కో మోటార్ ​ద్వారా10 ఎకరాలు సాగు..  

జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలంలోని లక్ష్మీపురం, యార్లగండి, పడగాయిగూడెం, చింతకుంట, బొజ్జలగూడెం, పునుకుడు చెలక, మర్రిగూడెం, మైలారం, బంగారు చెలక, తోకబంధం ఏజెన్సీ గ్రామాల్లోని పంట పొలాలకు త్రీఫేస్​ కరెంట్ ​లేదు. ఆయా గ్రామాల్లోని కొన్ని ప్రాంతాలకు ఇప్పుడిప్పుడే త్రీఫేస్​ కరెంట్​అందుతోంది. త్రీ ఫేస్​ కరెంట్​ లేక ఆయా గ్రామాలతో పాటు పలు ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలు ఎక్కువగా వర్షాధార పంటలపై ఆధారపడి ఉన్నంతలో పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

 ఈ క్రమంలో 2017–18 ఆర్థిక సంవత్సరంలో లక్ష్మీపురం, యార్లగండి, పడగాయిగూడెం, చింతకుంట, బొజ్జలగూడెం, పునుకుడు చెలక, మర్రిగూడెం, మైలారం, బంగారు చెలక, తోకబంధం ఏజెన్సీ గ్రామాల్లో సోలార్​ కరెంట్​తో పంటలు పండించేందుకు అప్పటి ఆఫీసర్లు 30కి పైగా సోలార్​ మోటార్లను గిరిజనులకు ఫ్రీగా పంపిణీ చేశారు. ఒక్కో సోలార్​ మోటార్​ సెటప్​కు దాదాపు రూ. 5లక్షలను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇద్దరు, ముగ్గురు రైతులకు ఒక మోటారు చొప్పున రెడ్​కో సంస్థ ద్వారా అందించారు. ఒక్కో మోటార్​ ద్వారా 5 ఎకరాల నుంచి10 ఎకరాల్లో పంటలు సాగు చేసుకునేలా ప్లాన్​ చేశారు. అప్పటి వరకు బీడు భూములుగా, కేవలం వర్షాధార పంటలకే పరిమితమైన భూములను ఇప్పుడు సోలార్​తో గిరిజనులు మూడు వందల ఎకరాల వరకు సాగులోకి తెచ్చారు. 

మరిన్ని మోటార్లు ఇస్తే అద్భుతాలే.. 

జిల్లాలోని ఆయా గ్రామాల గిరిజనులు సోలార్​ కరెంట్​తో పంటలు పండించడంలో సక్సెస్​ సాధించినా కొన్నాళ్ల తర్వాత మోటర్లు రిపేర్లకు రావడంతో కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు.  సోలార్ ​మోటార్లు పాడైన ప్రాంతాలను సర్వే చేసి వాటికి రిపేర్లు చేయించి, వాటికి తోడు కొత్త ప్రాంతాల్లో మరిన్ని మోటార్లు ఉచితంగా ఇస్తే అద్భుతాలు సృష్టిస్తామని గిరిజనులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. ఇటీవల లక్ష్మీదేవిపల్లి మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో సోలార్​తో పంటలు పండిస్తున్న తీరును ఐటీడీఏ ప్రాజెక్ట్​ ఆఫీసర్​ రాహూల్​ అధికారులతో కలిసి పరిశీలించారు. 

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం

సోలార్ మోటార్లతో వ్యవసాయం చేసుకునే వారికి అన్ని విధాలా సాయం అందిస్తాం. ప్రస్తుతం సాగు చేసుకుంటూ సోలార్ మోటార్లు రిపేర్లలో ఉన్న వాటిని రిపేర్ చేయించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నాం. రైతులకు కొత్తగా సోలార్ మోటార్లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం. సోలార్ మోటార్లు ఎంత మందికి అవసరమనే విషయమై సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిస్తాం. - రాహూల్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్