- ఎరువుల షాపు ఎదుట పురుగుల మందు డబ్బాలతో నిరసన
- భద్రాద్రి జిల్లా ములకలపల్లిలో ధర్నా
ములకలపల్లి, వెలుగు : నకిలీ వరి విత్తనాలతో తీవ్రంగా నష్టపోయామని, న్యాయం చేయాలని కొందరు గిరిజన రైతులు ఎరువుల షాపు ఎదుట పురుగుల మందు డబ్బాలతో బైఠాయించారు. ములకలపల్లి మండలం తాళ్లపాయ గిరిజన రైతులు యాసంగిలో వరి సాగుకోసం ములకలపల్లికి చెందిన బాలాజీ ఫెర్టిలైజర్అండ్ ఫెస్టిసైడ్స్ లో విత్తనపు వడ్లు కొన్నారు. అదును కంటే ముందే వరి ఈనింది. పొలమంతా తాలు కంకులు వచ్చాయి.
దీంతో వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే దుకాణ యాజమాని, విత్తన కంపెనీలు రైతులదే తప్పు అని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి చస్తామంటూ ఫర్టిలైజర్షాపు ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో విషయం తెలుసుకున్న ఏవో కరుణామయి అక్కడికి వచ్చి షాపులోని రికార్డులు పరిశీలించారు. 15 రోజులపాటు అమ్మకాలు నిర్వహించవద్దని ఆదేశించారు. ఉన్నతాధికారులకు చెప్పి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.