భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో యూనియన్ బ్యాంక్ ఎదుట గిరిజన రైతులు ఆందోళనకు దిగారు. పంట రుణాలు అందించడంలో బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హక్కు పత్రాలు ఉన్న పోడు రైతులకు వెంటనే పంట రుణాలను మంజూరు చేయాలని డిమాడ్ చేశారు. లేనియెడల ఆందోళన తీవ్రతరం చేస్తామని గిరిజన సంఘాల నేతలు హెచ్చరించారు.
ఇల్లందులో యూనియన్ బ్యాంక్ ఎదుట తమకు పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జూలై 24,2024న గిరిజన రైతులు ఆందోళనకు దిగారు. 2023 జూన్ లో ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు హక్కు పత్రాలను అందజేసింది. హ క్కుపత్రాలతో పంట రుణాలు ఇవ్వడానికి యూనియన్ బ్యాంక్ నిరాకరించింది.
యూనియన్ బ్యాంకు ఇల్లందు మండలంలోని కొమరారం, పోలారం, రొంపేడు, మర్రిగూడెం తో పాటు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలాన్ని కూడా దత్తత గ్రామాలుగా ప్రకటించుకుంది. ఈ దత్తత గ్రామాలలో 900 మంది రైతులు హక్కు పత్రాలు కలిగి పంట రుణాలను పొందలేకపోతున్నారు.
ఈ క్రమంలో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గత సంవత్సరం ఆందోళన చేసిన ఫలితంగా బ్యాంక్ అధికారులు లోన్ ఇస్తామని కాలయాపన చేస్తూ నేటి వరకు రైతులకు పంట రుణాలు ఇవ్వలేదని రైతులు ఆవేదన చెందారు. లోన్ ఇస్తామని చెప్పి హక్కు పత్రాలను తీసుకొని యూనియన్ బ్యాంక్ మేనేజరు తీసుకున్నారు. అయినా రైతులకు మాత్రం ఇప్పటివరకు లోన్లు ఇవ్వలేదని అన్నారు. రుణాల కోసం బ్యాంకు చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయిందన్నారు.
దీంతో బుధవారం గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం పోడు భూములకు హ క్కుపత్రాలు కలిగిన రైతులందరికీ పంట రుణాలు మంజూరు చేయాలని లేని యెడల ఆందోళన ఉధృతం చేస్తామని గిరిజన సంఘ నేతలు హెచ్చరించారు.