యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో గిరిజన రైతులను బంధించి.. కొందరికి మాత్రమే పోడు పట్టాలను పంపిణీ చేశారు. మంత్రితో మాట్లాడిస్తామని చెప్పి.. పట్టాల కోసం వచ్చిన మిగతా రైతులను కలెక్టరేట్ బయట ఉన్న ఓ రైస్‌మిల్లులోకి పంపి బయటకు రాకుండా పోలీసులు కాపలా కాశారు. తమకు పట్టా పాస్‌బుక్స్ వచ్చాయని, ఆఫీసర్లు చెప్తేనే వచ్చామని కొందరు బతిమిలాడినా పట్టించుకోలేదు. మంత్రి జగదీశ్ రెడ్డి వచ్చి, కొందరికి పంపిణీ చేసి వెళ్లిన తర్వాత గానీ విడిచిపెట్టలేదు.
మంత్రిని అడ్డుకుంటారనే..
యాదాద్రి జిల్లా భువనగిరి, చౌటుప్పల్ డివిజన్లలోని గిరిజన రైతులకు మంత్రి జగదీశ్‌రెడ్డి సోమవారం పోడు పట్టాల పంపిణీని పోలీస్ బందోబస్తు నడుమ చేపట్టారు. ఈ రెండు డివిజన్ల పరిధిలో 6,133 ఎకరాల భూములపై హక్కుల కోసం 2,130 మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 205 మందిని మాత్రమే పట్టాల కోసం ఆఫీసర్లు ఎంపిక చేశారు. ఇందులోనూ 77 మందికి సంబంధించిన 76.36 ఎకరాల పంపిణీ విషయంలో క్లారిటీ రాకపోవడంతో వాటినీ పక్కన పెట్టారు. మిగిలిన128 మందికి 137.36 ఎకరాలకు సంబంధించిన పట్టాలను సోమవారం మంత్రి చేతుల మీదు భువనగిరి కలెక్టరేట్‌లో పంపిణీ చేస్తామని ప్రకటించారు. దీంతో పోడు పట్టాలు అందని రైతులంతా కలెక్టరేట్‌కు వచ్చి మంత్రిని అడ్డుకుంటారనే ప్రచారం జరిగింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు యాదాద్రి కలెక్టరేట్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు. కలెక్టరేట్ మెయిన్ గేటును మూసి, తాము ఎంపిక చేసినవాళ్లనే లోపలికి అనుమతించారు. మిగతా వారిని ఓ రైస్‌మిల్లులోకి పంపించి, బయటకు రాకుండా కాపలా కాశారు.
కొందరికే పట్టాలు
పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని గంటలో తూతూమంత్రంగా నిర్వహించి ముగించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి కొంతమందికి పట్టాలు అందించి వెళ్లిపోగా, మరికొందరికి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు. తర్వాత కొందరికి పట్టాలు అందించిన ఆఫీసర్లు.. మిగిలిన వారికి ఆయా మండలాల్లో ఇస్తారని చెప్పారు. దీంతో రైతులు వాగ్వాదానికి దిగారు. తమకూ ఇక్కడే ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ అధికారులు పట్టించుకోలేదు. మంత్రి, ఎమ్మెల్యే వెళ్లిపోయిన తర్వాత రైస్‌మిల్లు నుంచి గిరిజన రైతులను పోలీసులు బయటకు పంపారు. పట్టాలు పంపిణీ చేస్తామని రప్పించి, రైస్‌మిల్లులో బంధించడమంటేని వారు మండిపడ్డారు.