ఆదివాసీ ఫ్రెండ్లీ పోలీస్.. జైనూర్​ ఇష్యూ తర్వాత మారిన పంథా

  • ఆదివాసీ గిరిజనం పట్ల ప్రత్యేక శ్రద్ధ
  • మరోసారి ఇబ్బంది రాకుండా సర్కార్ నజర్
  • మంత్రి సీతక్క, కలెక్టర్, ఎస్పీ చొరవ

ఆసిఫాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జైనూర్​లో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత పోలీసుల తీరు మారింది. భవిష్యత్​లో మళ్లీ ఇలా జరగకుండా ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా ఆదివాసీ ఫ్రెండ్లీ పోలీసింగ్ సమర్థంగా నిర్వహిస్తున్నారు. గిరిజన గ్రామాలు, గూడాల్లో పోలీసులు తామున్నామని భరోసా కల్పిస్తున్నారు. గిరిజనులకు ప్రభుత్వ పథకాలు పక్కగా అందించడం సహా సమస్యలు తీర్చడం, సేవా, సామాజిక కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. గత నాలుగు నెలలుగా అటు ప్రభుత్వం, ఇటు పోలీసు యంత్రాంగం చేస్తున్న కృషితో ఏజెన్సీలో క్రైమ్ రేట్ సైతం తగ్గుతుండడం విశేషం. 

జైనూర్​ ఘటనతో ప్రభుత్వం సీరియస్​

ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో పని చేసే పోలీసు అధికారులు, సిబ్బంది అక్కడి ప్రజలతో మమేకమై పని చేస్తుంటారు. గిరిజనులు సైతం తమ కోసం పనిచేస్తున్న అధికారులను ఆరాధించేవారు. కానీ గత ఐదేండ్లలో పోలీసులు, గిరిజనులకు మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడింది. ఈ పరిణామలు ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీలో అలజడి, ఘర్షణలకు కారణమయ్యాయి. జైనూర్​లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ శాంతిభద్రతల సమస్యను ఎత్తిచూపింది.

ALSO READ | పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకు బీఆర్ఎస్..10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా

 ఈ ఘటనను సీరియస్​గా తీసుకున్న  ప్రభుత్వం.. పోలీస్ శాఖ తీరు మార్చుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రజల మధ్య వైషమ్యాలు లేకుండా కలసి జీవనం సాగించేలా చూడాలని సూచించింది. జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్క రంగంలోకి దిగి ఇరు వర్గా లను సముదాయించే ప్రయత్నం చేశారు. ఆదివాసీలను తీసుకెళ్లి సీఎం రేవంత్​రెడ్డిని కలిపించారు. ఆర్మీ అనుభవం ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సైతం దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఎస్పీ డీవీ శ్రీనివాస రావుతో కలిసి ఆదివాసీ గిరిజనులు, ముస్లిం సంఘాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. అల్లర్లు, విధ్వంసానికి కారకులైన వారిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. మళ్లీ ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా పోలీసు శాఖ ప్రయత్నిస్తోంది. గిరిజన గ్రామాల్లో అవగాహన సదస్సులు, హెల్త్ క్యాంపులతోపాటు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

విస్తృతంగా సేవా కార్యక్రమాలు

జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో పోలీసులు మీకోసం–ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో పోలీసులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. స్వయం ఉపాధి మార్గం చూపిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో కుట్టు శిక్షణ ఇప్పిస్తున్నారు. వారికి ఫ్రీగా కుట్టు మెషీన్లు సైతం అందజేస్తున్నారు. ఇటీవల జైనూర్, సిర్పూర్ యు మండలాలకు చెందిన 35 మంది మహిళలకు కుట్టు మెషీన్లు అందచేశారు. నిరుపేదలకు నిత్యావసరాలు, దుప్పట్లు, యువకులకు వాలీబాల్ కిట్లు, విద్యార్థులకు నోట్​బుక్స్, పెన్నులు, దివ్యాంగు లకు వీల్ చైర్లు అందిస్తున్నారు. హెల్త్ క్యాంపులు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా 
అందిస్తున్నారు.

ఆదివాసీలకు అండగా ఉంటాం

ఆదివాసీలకు అండగా ఉంటాం. అభివృద్ధి, సంక్షేమం, భద్రత కోసం ఎల్లప్పుడూ సహకారం అందిస్తున్నం. జైనూర్ ఘటన తర్వాత సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నం. మెగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నం. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. యువత కోసం ప్రత్యేకంగా ఉద్యోగ మేళా నిర్వహిస్తాం. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం.- ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఆసిఫాబాద్