
- సాధారణ రైతు కుటుంబంలో పుట్టి డిప్యూటీ కలెక్టర్ స్థాయికి
- ఇది మూడో ప్రభుత్వ ఉద్యోగం
దండేపల్లి, వెలుగు: సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఓ గిరిజన యువతి పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగాలను కొల్లగొడుతోంది. ఇప్పుడు ఏకంగా గ్రూప్1లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బానావత్ దశరథ్, లలిత దంపతుల మూడో కూతురు వనజ ఆదివారం విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో 504.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 38వ ర్యాంకు సాధించి ఉమ్మడి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. పదో తరగతి వరకు దండేపల్లిలోని జిల్లా పరిషత్ స్కూల్లో తెలుగు మీడియంలో చదివిన వనజ.. ఐటీడీఏ స్కాలర్‌షిప్‌తో కరీంనగర్‌లోని ఆల్ఫోర్స్ కాలేజీలో ఇంటర్, కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ పూర్తి చేసింది.
హైదరాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్ లో చేరి సివిల్స్‌కు సన్నద్ధమైంది. గతంలో విడుదలైన గ్రూప్ 4లో ఎస్టీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత జూనియర్ లెక్చరర్‌గానూ ఉద్యోగం సాధించి వరంగల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వారం క్రితమే జాబ్‌లో చేరింది. ప్రస్తుతం గ్రూప్1లో 38వ ర్యాంకు సాధించిన వనజకు డిప్యూటీ కలెక్టర్ జాబ్ వచ్చే అవకాశం ఉండడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆమెను అభినందిస్తూ ట్రైబల్ జర్నలిస్ట్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు లకావత్ రమేశ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు సన్మానించారు.
విష్ణునందన్కు 166 ర్యాంకు
దండేపల్లి మండల కేంద్రానికి చెందిన గవర్న మెంట్ టీచర్ పాత రమేశ్, కేసరి దంపతుల కొడుకు విష్ణునందన్ గ్రూప్ 1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 166 ర్యాంక్ సాధించాడు. గతంలో ప్రకటించిన గ్రూప్ 4లో జాబ్ సాధించి హైదరాబాద్‌లో ఉద్యానవన శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
జూనియర్ అసిస్టెంట్‌కు161 ర్యాంక్
జన్నారం, వెలుగు: జన్నారం మండలం పొనకల్ గ్రామానికి చెందిన నగురు హరిదాస్ ,భాగ్యలక్ష్మి దంపతుల మూడో కొడుకు అనిల్ కుమార్ రాష్ట్రస్థాయిలో 161 ర్యాంక్ సాధించారు. గతేడాది గ్రూపు 4లో ఎంపికైన అనిల్ కుమార్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. హరిదాస్ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేశారు. పదేండ్ల క్రితమే ఆనారోగ్యంతో చనిపోయారు. అనిల్ కుమార్ సోదరుల్లో పెద్దవాడైన అరుణ్ కుమార్ ఆర్టీసీ డ్రైవర్‌గా, రెండో సోదరుడు అజయ్ కుమర్ ట్రాన్స్ కోలో అసిస్టెంట్ ఏఈగా పనిచేస్తున్నారు.