గిరిజనేతరులను ఎస్టీల్లో చేర్చొద్దు

  • తెలుగు రాష్ట్రాలు అసెంబ్లీ తీర్మానాలను వెనక్కి తీసుకోవాలి
  • భద్రాద్రిలో 'జై ఆదివాసీ' పేరిట భారీ ర్యాలీ

భద్రాచలం, వెలుగు : గిరిజనేతరులను ఎస్టీల్లో చేర్చేందుకు తెలుగు రాష్ట్రాలు చేసిన అసెంబ్లీ తీర్మానాలను వెనక్కి తీసుకోవాలని ఆదివాసీ నేతలు డిమాండ్ చేశారు. భద్రాద్రిలో ఆదివారం సాయంత్రం ‘జై ఆదివాసీ’ పేరిట రెండు రాష్ట్రాల ఆదివాసీలు భారీ ర్యాలీ తీశారు. పట్టణంలోని జూనియర్​కాలేజీ గ్రౌండ్​లో బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆదివాసీ నేతలు మాట్లాడుతూ 1976–-78లో లంబాడీ, యానాది, ఎరుకులను ఎస్టీల్లో చేర్చి జల్, జంగిల్, జమీన్, నిధులు, నియామకాలు, రిజర్వేషన్​హక్కులను దోచిపెట్టారన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని 20 ఏండ్లుగా ఉద్యమిస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ ఉద్యోగ హక్కు జీవో నెం.3ను బలహీనపరిచి, సుప్రీంకోర్టు కొట్టేసేలా చేశారని ఆరోపించారు. తాజాగా11 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అది కూడా ఆదివాసీ ఎమ్మెల్యేలతోనే తీర్మానాలు చేయించడం దారుణమన్నారు. నిర్ణయాలు మార్చుకోకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ‘జై ఆదివాసీ’ సభలో రెండు తెలుగు రాష్ట్రాలు జీవో నంబర్​3కి బదులు ఆదివాసీ సబ్ ప్లాన్, ఉద్యోగ నియామక చట్టం చేయాలని, లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, పోలవరం నిర్వాసిత ఆదివాసీలకు మెరుగైన పరిహారం, పునరావాసం అందించాలని తీర్మానం చేసింది. అంతేకాకుండా పవర్ ప్లాంటులో 50శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, బ్యాక్​వాటర్​లో టూరిజం, ఫిషింగ్​స్థానిక ఆదివాసీలకు మాత్రమే కేటాయించాలని డిమాండ్​చేశారు.

సభలో ఆదివాసీ సంక్షేమ పరిషత్​జాతీయ అధ్యక్షుడు దాట్ల నాగేశ్వరరావు, తెలంగాణ అధ్యక్షుడు ఊకె శంకర్, జాతీయ కార్యదర్శి సోడె మురళి, జాతీయ సమన్వయ కర్త మడవి నెహ్రూ, ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వాగబోయిన చంద్రయ్యదొర, జాతీయ ప్రధాన కార్యదర్శిసున్నం వెంకటరమణ, ఏపీ రాష్ట్ర కార్యదర్శి బంగారు వెంకటేశ్వర్లు, ఆదివాసీ టీచర్స్ అసోషియేషన్​ఏపీ అధ్యక్షుడు పూసం శ్రీను, రామరాజుదొర, మత్స్య లింగం, రాజుబాబు పాల్గొన్నారు.