
- చత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ నుంచి భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు వచ్చిన ఆఫీసర్లు
- ఐటీడీఏ పీవోను కలిసి పరిస్థితిని వివరించిన అసిస్టెంట్ కమిషనర్
- మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య నలిగిపోయి.. ఉపాధి కరవై వలస బాట
- జిల్లాలో 27 గ్రామాల్లో 39,175 జనాభా ఉన్నట్లుగా అంచనా
- తిరిగి బస్తర్‌లోని తమ గ్రామాలకు వచ్చేలా ప్లాన్..
- సర్వేతో వారి అభిప్రాయలపై బస్తర్ కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్న అధికారులు
భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ లోని దండకారణ్యం నుంచి ఆదివాసీల వలసలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బస్తర్ అటవీ ప్రాంతం నుంచి వేల సంఖ్యల్లో గొత్తికోయలు బతుకు దెరువుకు ఇతర ప్రాంతాలకు వస్తున్నారు. ప్రధానంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు వచ్చి అడవుల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ఆపరేషన్ కగార్ కారణంగా మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య నలిగిపోయి.. ఉపాధి కరవై ఉన్న ఊరును వదిలి వచ్చినవారే చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని గుర్తించేందుకు చత్తీస్‌గఢ్ సర్కారు రంగంలోకి దిగింది.
బస్తర్ కలెక్టర్ ఆదేశాలతో అసిస్టెంట్ కమిషనర్ కల్యాణ్ సింగ్ శనివారం భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. పనులు లేక, మావోయిస్టులకు భయపడి ఊరు వదిలేసి వచ్చిన వారి వివరాలు సేకరించేందుకు సహకరించాలని ఆయన కోరారు. దీంతో ఐటీడీఏలోని కొందరు ఆఫీసర్లను సర్వే కోసం వారికి కేటాయించారు.
రెండు దశాబ్దాలుగా వలసలు
2004 సంవత్సరం నుంచి చత్తీస్‌గఢ్ దండకారణ్యంలో అంతర్యుద్ధం మొదలు కాండంతో వలసలు వేగంగా పెరిగాయి. మావోయిస్టులను నిరోధించేందుకు అక్కడి ప్రభుత్వం మావోయిస్టు వ్యతిరేక సంస్థ ‘సల్వాజుడుం’కు సపోర్టు చేయడంతో భద్రతాబలగాలు, సల్వాజుడుం అరాచకాలకు గొత్తికోయలు బెంబేలెత్తిపోయారు. ఊళ్లను తగులబెట్టడం, మావోయిస్టులకు సహకరిస్తున్నారంటూ దారుణంగా హత్య చేయడం లాంటి భయానక వాతావరణంలో బతుకు జీవుడా అంటూ గొత్తికోయలు భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు వలస వచ్చారు. అలా వచ్చిన వారే చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూరు, పాల్వంచ, అశ్వారావుపేట, దమ్మపేట, ఆళ్లపల్లి, టేకులపల్లి, కరకగూడెం, చండ్రుగొండ, గుండాల, పినపాక మండలాల్లోని వాగులు, నదుల వెంబడి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు.
పోడు కొట్టుకుని వ్యవసాయం చేస్తున్నారు. దాదాపుగా జిల్లాలో 27 గ్రామాల్లో 39,175 జనాభా ఉన్నట్లుగా అంచనా. చాలా మందికి ఇక్కడ ఆధార్‌కార్డులు, రేషన్, ఉపాధి హామీ కార్డులు కూడా ఉన్నాయి. వీరి కోసం అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు కూడా నెలకొల్పారు.
కాగా వీరికి ఎస్టీ సర్టిఫికెట్ విషయంలోనే వివాదం నెలకొంది. ఇక్కడి ప్రభుత్వం గొత్తికోయలకు ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. చాలా మంది వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. మిరప కోతలకు వెళ్తున్నారు. కానీ వారి బతుకుకు ఎలాంటి భరోసా దొరకడం లేదు. పలు ఎన్జీవో సంస్థలు చత్తీస్‌గఢ్ సర్కారుకు వీరి అవస్థలు, సమస్యలు వివరించాయి. మావోయిస్టుల ఏరివేత, ఆపరేషన్ కగార్ కారణంగా ప్రస్తుతం బస్తర్ ప్రాంతంలో పరిస్థితులు చక్కబడుతుండడంతో అక్కడి ఆఫీసర్లు వలస ఆదివాసీలను గుర్తించి తమ ప్రాంతాలకు వెళ్లేలా చూసే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం వారిలో ఆశలు రేకెత్తిస్తున్నాయి.
ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం
పీవో రాహుల్‌తో సమావేశమై సర్వే వివరాలను తెలిపాను. వలస గ్రామాల్లోకి వెళ్లి వారితో మాట్లాడుతాం. వారి అభిప్రాయాలు తెలుసుకుంటాం. తిరిగి బస్తర్‌లోని తమ గ్రామాలకు రావడానికి వారి ఇష్టాన్ని తెలుసుకుని బస్తర్ కలెక్టర్‌కు పూర్తి నివేదిక ఇస్తాం.- కల్యాణ్‌సింగ్, అసిస్టెంట్ కమిషనర్