భద్రాచలం ట్రైబల్ మ్యూజియం..ఇక టూరిజం స్పాట్

భద్రాచలం ట్రైబల్ మ్యూజియం..ఇక టూరిజం స్పాట్
  • పర్యాటకులను ఆకర్షించేలా ఆధునీకరణ 
  • డెవలప్ మెంట్ చేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ 
  • త్వరగా నివేదిక అందించాలని ఐటీడీఏ పీవో రాహుల్ సూచన​

భద్రాచలం,వెలుగు : భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ట్రైబల్​మ్యూజియం ఇక టూరిజం స్పాట్ గా మారనుంది. డెవలప్ మెంట్ చేసేందుకు పీవో రాహుల్​ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. భద్రాచలం రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు, పాపికొండలకు చూసేందుకు వచ్చే పర్యాటకులను ఆకర్షించేలా పూర్తి వివరాలతో నివేదికను ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. దీంతో కమిటీ నివేదికలను తయారు చేసే పనిలో నిమగ్నమైంది.  ఐటీడీఏ ప్రాంగణంలోని ప్రస్తుత ట్రైబల్ మ్యూజియంలో కోయ, బంజార, కొండరెడ్డి తెగల గిరిజన సంప్రదాయ వస్తువులు ఉన్నాయి. 

వారు వాడే వస్తువులు, అలంకరించుకునే నగలు, వ్యవసాయ పనిముట్లు, సంప్రదాయ దుస్తులు, కొమ్ములు, సంగీత పరికరాలు, దేవతామూర్తుల బొమ్మలు, గుడిసెల నమూనాలు ఇలా పలు రకాల వస్తువులు ఉన్నాయి. వీటిని  ఎవరైనా వీఐపీ వచ్చినప్పుడు మాత్రమే బయటకు తీసి చూపిస్తున్నారు. 

పర్యాటకులను ఆకర్షించేలా..

మ్యూజియం ఆవరణలో రెండు చెరువులు ఉండగా.. బోటింగ్ ​కు డిజైన్.. ఆదివాసీలు నివసించే వెదురు ఇండ్లు, గుడిసెలు నిర్మిస్తారు. పర్యాటకులు సేదతీరేలా రూపొందిస్తారు.  అటవీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతారు.  గిరిజన సంప్రదాయ కొమ్ములు, రేలా డ్రెస్​లు ధరించి వాటితో ఫొటోలు దిగేలా ఫొటో షూట్​ఏర్పాటు చేస్తారు.  రేలా నృత్యాలు, కొమ్ము డ్యాన్సులు ఆదివాసీలతో కలిసి వీడియో షూట్​చేసేలా కూడా టూరిస్టుల కోసం తీర్చిదిద్దుతారు.  

నాయకపోడు, ఆదివాసీ, కొండరెడ్లు వెదురు, కలపతో తయారు చేసే బొమ్మలను టూరిస్టులు కొనుగోలు చేసేలా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు.  అటవీ ఉత్పత్తులు, వనమూలికలు కూడా అందుబాటులో ఉంచుతారు. అడవి, ఆదివాసీల సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు.. ఇలా పర్యాటకులు ఆస్వాదించేలా ఐటీడీఏ యాక్షన్​ ప్లాన్​ చేపట్టింది. 

ఆకట్టుకునేలా డెవలప్ మెంట్​ 

ఐటీడీఏ పీవో ఆదేశాలతో కమిటీ నివేదిక తయారు చేస్తుంది. ఇప్పటికే పలు దఫాలు మీటింగ్​లు జరిగాయి. టూరిస్టులను ఆకట్టుకునేలా మ్యూజియాన్ని ఆధునీకరిస్తాం. పర్యాటకులను ఆకట్టుకునేలా మార్పు చేస్తం. 

- డేవిడ్​రాజ్​, ఏపీవో, భద్రాచలం ఐటీడీఏ  

అరకు తరహాలో చేయాలి 

ఆంధ్రాలోని అరకు ట్రైబల్​మ్యూజియం తరహాలో డెవలప్ చేయాలి. భద్రాచలం మన్యంలోని ఆదివాసీ తెగల ఆచార, వ్యవహారాలు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, సంస్కృతి ప్రపంచానికి తెలియజెప్పేలా ఉండాలి.  ఆకట్టుకునేలా, ఆకర్షణీయంగా మ్యూజియాన్ని తీర్చిదిద్దాలి. 

 ముర్ల రమేశ్, కొండరెడ్ల సంఘం 
వ్యవస్థాపక అధ్యక్షుడు