
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి మున్సిపాలిటీని గ్రామ పంచాయతీగా మార్చాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆదివారం మందమర్రి పాత బస్టాండ్ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం పాత బస్టాండ్ ఏరియాలో సమావేశం ఏర్పాటు చేసి లీడర్లు మాట్లాడారు.
మందమర్రి, ఊరు రామకృష్ణాపూర్, నార్లపూర్ రాజ్యాంగంలోని ఆర్టికల్342 సెక్షన్(2) ప్రకారం గ్రామపంచాయతీలుగా కొనసాగుతుండగా.. వృత్తి, ఉపాధి, జనాభా వంటి అంశాలను లెక్కగడుతూ మున్సిపాలిటీగా మార్చారని అన్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతమైన మందమర్రి అభివృద్ధి దూరంగా ఉందన్నారు. మున్సిపాలిటీని రద్దు చేసి తిరిగి మందమర్రి గ్రామపంచాయతీగా మార్చి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ సంఘాల ఆందోళనకు మందమర్రి ఎన్నికల సాధన ఏజేసీ మద్దతు పలికింది.