- నవంబర్ 15 బిర్సా ముండా జయంతి
జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా ఉలిహత్ గ్రామంలో 1875 నవంబర్ 15న సుగుణ ముండా, కర్మిహాట్ ఆదివాసీ దంపతులకు బిర్సా ముండా జన్మించాడు. చిన్నతనంలో గొర్రెలు మేపుతూ కుటుంబానికి అండగా నిలిచిన బిర్సా తర్వాత సాల్గా గ్రామంలో మేనమామ వద్ద ఉంటూ ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. అనంతం చయిబాసాలోని మిషనరీ పాఠశాలలో చేరాడు. ఇందుకోసం క్రైస్తవంలోకి మారాల్సి వచ్చింది. బిర్సా ముండా పేరు బిర్సా డేవిడ్‌గా మారింది.
చదువుకుంటూనే ప్రాచ్యాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాడు. అప్పట్లో ఆదివాసీల భూములపై బ్రిటిష్ పాలకులు అధిక పన్నులు వసూలు చేసేవారు. చెల్లించని వారి ఆస్తులను లాక్కునేవారు. బ్రిటీషర్లకు ఎదురు తిరిగితే వారు పెట్టే బాధలు పడలేక చాలామంది ఆదివాసీలు అస్సాంలోని తేయాకు తోటలోకి కూలీలుగా వెళ్లేవారు. తమ భూములను తిరిగిచ్చేయాలని ఒకరోజు ముండా తెగ పెద్దలతో కలిసి బిర్సా తెల్లదొరలపై ఒత్తిడి చేశాడు. దాంతో మిషనరీ పాఠశాల ఆయన్ను బహిష్కరించింది.
ఆదివాసీలకు ప్రత్యేక మతం
బ్రిటీషర్లతో ముండా, సంతల్, ఓరియన్, కోల్ జాతి తెగలు ఎప్పటికైనా ప్రమాదంలో పడే అవకాశం ఉందని భావించిన బిర్సా ప్రత్యేకంగా 'బిర్సాయిత్' మతాన్ని స్థాపించాడు. ఆయా తెగలకు ఆధ్యాత్మిక అంశాలు బోధించేవాడు. ఐకమత్యంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాడు. ఆయన నిర్వహించిన సేవా కార్యక్రమాలు నచ్చిన ఆదివాసీలు బిర్సా ముండాను ధర్తీలబా(దేవుడు) గా కొలిచేవారు..తెల్లదొరలకు వ్యతిరేకంగా 1899 డిసెంబర్ లో ఉల్ గులాన్ (తిరుగుబాటు) పేరుట పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించగా అందులో 7000 మంది పాల్గొన్నారు.
1900 ఫిబ్రవరి 3న జంకోపాయి అటవీ ప్రాంతంలో బిర్సాను అరెస్టు చేసి రాంచీ జైలుకు తరలించారు. బ్రిటిష్ ప్రభుత్వం బిర్సా ముండాను 1900 జూన్ 9న విష ప్రయోగంతో చంపేసింది బయటకు మాత్రం మలేరియాతో మరణించాడు అంటూ ప్రచారం చేసింది. ఇప్పటికీ ఆయన్నీ జార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఆదివాసీలు 'భగవాన్ బీర్సా ముండా'గా పూజిస్తున్నారు. బిర్సా కేవలం 25 సంవత్సరాల వయసులోనే అమరుడయ్యాడు. ఆయన ఉద్యమ ఫలితంగానే 1908లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం చోటా నాగపూర్ కౌలుదారుల హక్కు చట్టంను అమల్లోకి తీసుకువచ్చింది.
- డా. చింత ఎల్లస్వామి,అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్రైబల్ యూనివర్సిటీ-