దేశానికి స్వాతంత్ర్యం లభించి 73 ఏండ్లు, రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా రాజ్యాంగంలో కల్పించిన ఆదివాసీ హక్కులు, రిజర్వేషన్లు, రక్షణ చట్టాలు సరిగ్గా అమలు కావట్లేదు. ఆర్యులకు ముందు మన దేశంలో వర్ణ, కుల వ్యవస్థలు లేవు. వీరు స్థిరపడిన తర్వాతే దేశంలో మూలజాతుల వారు అణచివేతకు గురయ్యారు. కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేమని, అన్ని రకాల అసమానతలను తుడిచివేయాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్నారు. దేశ జనాభాలో 85 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు చట్టసభల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న ముందుచూపుతో రిజర్వేషన్లు, రాజ్యాధికారం అనే సంకల్పాన్ని అంబేద్కర్ ప్రకటించారు. 1946లో రాజ్యాంగ నిర్మాణానికి అడుగులు మొదలు పెట్టినప్పుడు.. అప్పటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఆకళింపు చేసుకున్న అంబేద్కర్ బాహ్య సమాజానికి దూరంగా ఆటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ తెగల అభివృద్ధి గురించి ఆలోచన చేశారు. రాజ్యాంగంలోని 12 షెడ్యూళ్లలో అంబేద్కర్ ప్రత్యేకించి రెండు షెడ్యూళ్ల(5,6)ను గిరిజనులకు కేటాయించడం గొప్ప విషయం. అయితే రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏండ్లు దాటినా.. దళిత, ఆదివాసీ గిరిజనులు ఇంకా వెనుకబడే ఉన్నారు. దీనికి గల కారణాలను ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్రాల్లోని పాలకులు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో ఇంతకాలం నిరాదరణకు గురైన కుల, మత, ప్రాంత, జాతి తదితర వివిధ అస్థిత్వాల వారి వాస్తవ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర ప్రణాళికల్ని ప్రభుత్వాలు రూపొందించాలి. కానీ, అటవీ వనరులను దోచుకునేందుకు ఆదివాసీ ప్రాంతాలను బహుళజాతి కంపెనీలకు అనుకూలమైన అభివృద్ధి పంథాను అవి అనుసరిస్తున్నాయి. నేడు అస్థిత్వ పోరాటంలో ఎదురీదుతున్న ఆదివాసీలు, రిజర్వేషన్లలో అసమతుల్యత వల్ల దిక్కుతోచని స్థితిలో నిరాదరణకు గురవుతున్నారు. దీనికి రాజకీయ లబ్ది కోసం వివిధ పాలక వర్గాలు కొన్నేండ్లుగా అవలంబిస్తున్న అసంబద్ధ విధానాలే కారణం. ఇవి అంబేద్కర్ ఆశయ సిద్ధిని ఆటంకపరుస్తున్నాయి. అణగారిన వర్గాల రిజర్వేషన్ల అమలుతోపాటు, ఆర్టికల్ 16(4) ప్రకారం ఎస్సీ, ఎస్టీల ఉద్యోగ పదోన్నతులను కొనసాగించాలి. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు పాలన సవ్యంగా సాగిస్తే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది.
- గుమ్మడి లక్ష్మీ నారాయణ,ఆదివాసీ రచయితల వేదిక,వ్యవస్థాపక కార్యదర్శి