ట్రైబల్ వర్సిటీ అడ్మిషన్లు ఈ‌‌‌‌‌‌‌‌సారీ‌‌‌‌‌‌‌‌ లేనట్లే!

  • ఎన్టీఏ సీయూ సెట్ నోటిఫికేషన్​లో లేని వర్సిటీ పేరు
  • మంజూరై ఐదేండ్లు.. ఖరారు కాని కోర్సులు
  • ఇప్పటి వరకు మొదలు‌‌‌‌‌‌‌‌కాని అడ్మిషన్ల ప్రక్రియ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి ట్రైబల్ యూనివర్సిటీ మంజూరై ఏండ్లు గడుస్తున్నా అడ్మిషన్ల ప్రక్రియ మాత్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు మూడేండ్లుగా చెప్పడమే తప్పా.. అడుగు ముందుకు పడడం లేదు. ఈ ఏడాది తాత్కాలిక బిల్డింగ్ లోనైనా క్లాసులు మొదలవుతాయని భావించినా.. ఈసారి కూడా అడ్మిషన్లు మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నేషనల్ టెస్టింగ్ అథారిటీ(ఎన్టీఏ) సీయూసెట్ నోటిఫికేషన్ ను గురువారం విడుదల చేసింది. నోటిఫికేషన్ లో పేర్కొన్న సెంట్రల్ వర్సిటీల జాబితాలో ములుగు ట్రైబల్ వర్సిటీ పేరు లేకపోవడం ఆ ప్రాంత ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈసారి కూడా అడ్మిషన్లు కాకపోతే మరో ఏడాది వెనక్కి పోయినట్లేనని ఆదివాసీ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో మూడేండ్ల క్రితమే మొదలు

విభజన చట్టంలో భాగంగా తెలంగాణ, ఏపీకి ట్రైబల్ సెంట్రల్ వర్సిటీలు మంజూరయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా కేంద్రానికి సమీపంలోని కొండకారకంలో జర్నలిజం, సోషియాలజీ, సోషల్ వర్క్, బాటనీ, కెమిస్ట్రీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్, జియాలజీ, ఇంగ్లిష్, టూరిజం విభాగాల్లో 10 పీజీ, ఏడు డిగ్రీ కోర్సులతో 2019 ఆగస్టులోనే ట్రైబల్ వర్సిటీ ప్రారంభమైంది. కానీ మన దగ్గర 2016లో ములుగు ఏరియాలో అనువైన భూముల గుర్తింపు, సేకరణ ప్రక్రియ మొదలుపెట్టినా ఆరేండ్లయినా కొలిక్కి రాలేదు. ములుగు జిల్లా జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ)ను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించగా అందులో తాత్కాలిక క్లాస్ రూమ్ లు ఏర్పాటు చేసి 2019 – 20 అకడమిక్ ఇయర్ నుంచి అడ్మిషన్లు ప్రారంభించాలని అప్పటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ అప్పారావు భావించారు. కానీ కోర్సులు ఖరారు కాకపోవడం, ఇతర కారణాలతో నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఆ తర్వాత కరోనా కారణంగా దేశవ్యాప్తంగా అకడమిక్ ఇయర్ డిస్టర్బ్ అయింది. గత విద్యా సంవత్సరంలోనూ అడ్మిషన్ల ప్రస్తావన రాలేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి కూడా చొరవ కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రహసనంగా భూసేకరణ

2018లో సుబ్రహ్మణ్యం కమిటీ వచ్చి ములుగులో రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన భూములను పరిశీలించింది. వర్సిటీకి 498 ఎకరాలు అవసరమని వారు  చెప్పగా.. రాష్ట్ర ప్రభుత్వం తొలుత169 ఎకరాలను సేకరించింది. మరో 117 ఎకరాల అసైన్డ్ ల్యాండ్​ను సేకరించినా నిర్వాసితులకు ఇంకా పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించలేదు. మరో 50 ఎకరాలు ఫారెస్ట్  డిపార్ట్​మెంట్ నుంచి సేకరించారు. మొత్తం 336 ఎకరాలు సేకరించినట్లు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, ఈ వివరాలను కేంద్ర మానవ వనరుల శాఖకు పంపలేదని తెలిసింది. మరోవైపు 2022‒23 సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ ట్రైబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్సిటీ ఏర్పాటుకు కేంద్రం రూ.40 కోట్లు కేటాయించింది. అంతకు ముందు రూ.10 కోట్లు కేటాయించింది. ఈ నిధులు వినియోగంలోకి రావాలంటే అడ్మిషన్ల ప్రక్రియ మొదలుపెట్టి, భవన నిర్మాణాలపై  దృష్టి సారించాల్సి ఉంది. కానీ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు.