కేంద్ర ప్రభుత్వం రూ.889.07 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ములుగులో ప్రారంభించనుంది. ఆదివాసీల ఆరాధ్య దైవాలైన 'సమ్మక్క, సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం'గా పేరు పెట్టడం హర్షణీయం. వచ్చే ఏడాది నుంచి తాత్కాలికంగా తరగతులు ప్రారంభించడానికి రెండు కోర్సులతో కూడిన పోస్టర్ ను తల్లుల దీవెనలతో మహిళా దినోత్సవం రోజున ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని 2017లోనే యూనివర్సిటీకి ఆమోదం తెలిపింది. మన రాష్ట్రం అక్షరాస్యతలో దేశంలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. కానీ, గిరిజనుల అక్షరాస్యత రాష్ట్ర అక్షరాస్యతతో పోల్చితే సుమారు 17 శాతం తక్కువ. రాష్ట్రంలో వీరి జనాభా 10 శాతంగా ఉంది. కళలు, భాష, సంస్కృతి, ఆచార సంప్రదాయాలలో గిరిజనుల శైలి విభిన్నం. అలాగే నైపుణ్యాలు, సామర్థ్యాల విషయాల్లో అత్యంత ప్రతిభావంతులు. కానీ, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచినా ఉన్నత విద్యను అభ్యసించే సగటు జనాభాతో పోల్చి చూసినప్పుడు గిరిజనుల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది.
50 శాతం సీట్లు తెలంగాణ గిరిజనులకే కేటాయించాలి
ఉమ్మడి ఏపీ రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చొరవతో గిరిజన యూనివర్సీటీని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి ప్రాంతంలో ఏర్పాటు చేశారు. 2019 తెలంగాణలోని జాకారంలో తాత్కాలిక తరగతులు ప్రారంభించడానికి హెచ్సీయూకి భాధ్యత అప్పగించినప్పటికీ ఆరంభం కాలేదు. అలాగే ఈ యూనివర్సీటీలో 30 శాతం సీట్లు రాష్ట్ర కోటాగా కేటాయించాలని గత ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పుడున్న ప్రభుత్వం 35 శాతానికి పెంచింది. తెలంగాణ గిరిజన అభ్యర్థులు ఉన్నత విద్యకు దూరం కాకుండా 50 శాతం సీట్లు తెలంగాణ గిరిజనులకే కేటాయించాలి. అలాగే ఉద్యోగాలు కనీసం 50శాతం వారికే కల్పించాలి. నేడు ఆదివాసీలు విద్య, ఉపాధి రంగాల్లో చాలా వెనకబడిపోయారు. ఉన్నత చదువులు చదవలేక, పశుపోషణ, అటవీ ఉత్పత్తుల సేకరణ, వ్యవసాయం చేసుకుంటూ ఏజెన్సీకి పరిమితం అయ్యారు. ఐదవ షెడ్యూల్ కు చెందిన ఆదివాసీ భూభాగంలోని తెలంగాణ ఆదివాసీలకు సరైన ఉన్నత విద్యావకాశాలు అందక చాలామంది నేడు నిరాశ్రయులుగా మిగులుతున్నారు. ఆదివాసీలకు ప్రత్యేకంగా ఉన్నత విద్యను అందించే ఆదివాసీ యునివర్సిటీ వల్ల ఆదివాసీ సమాజం విద్య, ఉపాధి రంగాల్లో ముందడుగు వేస్తుంది. ఈ యునివర్సిటీ ద్వారా ఆదివాసీ సమాజాన్ని మేల్కొల్పే అవకాశం ఉంటుంది. ఆదివాసీల వెనుకబాటుకు పరిష్కారం చూపాలి.
విద్యతో ఆదివాసీల సమస్యలకు పరిష్కారం
నేడు ఆదివాసీలు విద్యారంగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, మెడిసిన్, ఇంజినీరింగ్, అగ్రికల్చర్ వంటి వృత్తి విద్య, ఉన్నత చదువులు పొందాలంటే వారికి ప్రైవేట్ కళాశాలలే దిక్కు. వేలు, లక్షలు పెట్టి చదువుకునే ఆర్థిక స్తోమత ఆదివాసీలకు లేదు. ఆదివాసీ గ్రామాలలో సరైన పాఠశాలలు, కళాశాలలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటికి పరిష్కార మార్గంగా ఏజెన్సీలలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలంటే ఈ ప్రత్యేక యూనివర్సిటీ దోహద పడుతుంది. మానవ వనరుల ఉత్పత్తి ప్రక్రియలో, అభివృద్ధి ప్రక్రియలో ఆదివాసీలు భాగస్వామ్యం అవుతారు. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు ఒకేవిధంగా ఉంటున్నాయి. ఆదివాసీ తెగలను సంరక్షించడానికి ఈ విశ్వవిద్యాలయం ఉపకరిస్తుంది. ఆదివాసీ సమాజంపై జరుగుతున్న దోపిడీ, పీడన సమాజ పరిణామక్రమం వంటివి ఆదివాసీ యూనివర్సిటీ ద్వారా చర్చకు వస్తాయి. నేడు ఆదివాసీ విద్యార్థులు యూనివర్సిటీ విద్యకు వచ్చేసరికి ఒక శాతానికి తగ్గిపోతున్నారు. పైరవీలు, రాజకీయ నాయకులు అండదండలు ఉన్నవారికే ఇతర యూనివర్సిటీలలో సీట్లు ఇస్తున్నారు. ఆదివాసీ విద్యార్థులు ఆర్థిక స్తోమత లేక, సరైన సామర్థ్యం ఉండి కూడా యూనివర్సిటీ స్థాయిలో రాణించలేకపోతున్నారు. కావున, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని సమ్మక్క, సారక్క గిరిజన యూనివర్సిటీలో తెలంగాణ సీట్ల వాటాను, ఉద్యోగశాతాన్ని పెంచాలి.
- గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక