రేషన్ కోసం 5 కి.మీ.. పింఛన్ కోసం 20 కి.మీ. వెళ్లాల్సిందే.. ఆదివాసీల తిప్పలు

 రేషన్ కోసం 5 కి.మీ..  పింఛన్ కోసం 20 కి.మీ. వెళ్లాల్సిందే.. ఆదివాసీల తిప్పలు
  • సెల్ టవర్ నిర్మించినా నో సిగ్నల్
  • అత్యవసరంలో చెట్లు లేదా వాటర్ ట్యాంక్ ఎక్కాల్సిందే
  • ఊరికి రోడ్డు అంతంతే.. అంబులెన్స్ రానే రాదు
  • మారుమూల దిగడ గ్రామంలో ఆదివాసీల తిప్పలు

ఆసిఫాబాద్/దహెగాం, వెలుగు: కాలం మారుతోంది.. టెక్కాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. కానీ అడవిబిడ్డల కష్టాలు మాత్రం తీరడం లేదు. నిత్యావసరాలకూ నానా తిప్పలు పడుతున్నారు. సెల్​ఫోన్​ సిగ్నళ్లు రావు.. సంక్షేమ పథకాలు పొందాలంటే కిలోమీటర్ల దూరం వెళ్లాల్సింది. అత్యవసర పరిస్థితుల్లో గ్రామానికి అంబులెన్స్​ కూడా రాలేని పరిస్థితి. ఏండ్లుగా ఇలాంటి దుస్థితిలోనే బతుకుతున్నారు ఆసిఫాబాద్​ జిల్లా దహెగాం మండలం దిగడ ప్రజలు. 

అన్నీ సమస్యలే..

ఆసిఫాబాద్​ జిల్లా దహెగాం మండలం మారుమూల ప్రాంతంలో మహారాష్ట్ర బార్డర్​కు ఆనుకొని ఉంటుంది దిగడ గ్రామం. 90 గిరిజన కుటుంబాలున్న గ్రామంలో 500 మంది జనాభా ఉంటుంది. మూడు తరాలకు పైగా అడవులను నమ్ముకుని అక్కడే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కానీ తరాలు మారుతున్నా ఆ గిరిపుత్రుల తలరాతలు మారడం లేదు. ఏండ్ల కాలంగా నానా అవస్థలు పడుతున్నా అటు అధికారులు గానీ ఇటు ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోవడంలేదు.

గత ప్రభుత్వం మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మించి, ఊరి వరకు పైప్​లైన్ వేశారు. అయితే ఆ పైప్ లైన్లు సరిగ్గా వేయకపోవడంతో నీళ్లు సప్లై కావడం లేదు. దీంతో ఊర్లో ఉన్న బోర్ వెల్​లకు మోటార్ పైప్ లైన్లు బిగించుకుని కరెంటు ఉన్నప్పుడు నీళ్లు నింపుకుంటున్నారు. ఇక ఊరికి ఇప్పటివరకు త్రీ ఫేజ్ కరెంటు లేదు. ఉన్న సింగిల్ ఫేజ్ కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. దిగడ ఊరి ప్రజలకు నెట్​వర్క్​ అందని ద్రాక్షగానే మారింది. గతేడాది గ్రామ సమీపంలో సెల్ టవర్ నిర్మించినా.. దానికి సిగ్నల్ ఇవ్వలేదు. చెట్లు, వాటర్​ట్యాంక్​ ఎక్కితేగానీ అరకొర సిగ్నల్​ రాదు.

ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు

దిగడ గ్రామస్తులు కనీసం రేషన్ , పింఛన్ కూడా ఊరిలో పొందలేకపోతున్నారు. రేషన్ కోసం ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపూర్​కు వెళ్లాల్సిందే. అక్కడ కూడా బయోమెట్రిక్ కాకుండా మ్యానువల్ గానే బియ్యం అందిస్తున్నారు. ఆ బియ్యాన్ని అధికారులు  ఊరిలో ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయడంలేదు. సర్కార్ ఇచ్చే పింఛన్ కోసం లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఊరికి 20 కి.మీ. దూరంలో ఉన్న గిరవెల్లి గ్రామానికి వెళ్లి అక్కడ పోస్ట్ మ్యాన్ దగ్గర ఫించన్ తీసుకుంటున్నారు.

Also Read :- 4.41 లక్షల మందికి రైతు భరోసా

 ఆటోల్లో రానుపోను రూ.200 ఖర్చు చేయాల్సి వస్తోంది. దురదృష్టవశాత్తు లబ్ధిదారులు వెళ్లిన రోజు సిగ్నల్, నెట్​వర్క్ ఇష్యూ వస్తే ఉట్టి చేతులతో ఇంటికి వచ్చి మళ్లోరోజు వెళ్లాల్సిందే. తమ సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ఐటీడీఏ అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ సమస్యలు పరిష్కరించి సౌలత్ లు కల్పించాలని కోరుతున్నారు.

తాగు, సాగు నీరు ఇవ్వాలె

మా ఊరికి మిషన్ భగీరథ నీళ్లు వస్తలెవ్. పైప్ లైన్ వేసినా ఇప్పటి వరకు సప్లై కావడం లేదు. నేటికీ బోర్ నీళ్లే తాగుతున్నం. నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలె. త్రీ ఫేజ్​ కరెంట్ లేక వర్షాధార పంటలపై ఆధారపడి బతుకుతున్నం. త్రీ ఫేస్ కరెంట్ సౌకర్యం కల్పించాలే.- కోవ కనకయ్య, మాజీ సర్పంచ్, దిగడ

సెల్​ఫోన్​ సిగ్నల్ లేక బాహ్య ప్రపంచానికి దూరం

ఊరికి సెల్​ఫోన్ సిగ్నల్ లేక బాహ్య ప్రపంచానికి దూరంగా బతుకుతున్నం. ఊరి సమీపంలో సెల్ టవల్ నిర్మించినా సిగ్నల్స్ మాత్రం రావడం లేదు. నెట్వర్క్​ను త్వరలో అందుబాటులో తేవాలి. అత్యవసర పరిస్థితుల్లో, దవాఖానాకు, అంబులెన్స్​కు ఫోన్ చేయాలంటే ఇండ్లు, చెట్లు ఎక్కి ఫోన్ చేయాల్సిన దుస్థితి ఉంది. ఆపద సమయంలో సమాచారం ఇవ్వలేకపోతున్నం. సెల్ ఫోన్ సిగ్నల్ అందించాలె.- సిడం రమేశ్ గ్రామస్తుడు

పింఛన్, రేషన్ సమస్య తీర్చండి

ఏండ్ల సంది పింఛన్, రేషన్ బియ్యం కోసం గోస పడుతున్నం. మా ఊరిలో సెల్ ఫోన్ సిగ్నల్ రాక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపూర్​కు బియ్యం తెచ్చుకునేందుకు నడుచుకుంటూ, బండ్లు, ఆటోల్లో పోతున్నం.రానుపోను కష్టం అవుతోంది. అధికారులు స్పందించి మా కష్టాలు తీర్చాలి- సిడం భిక్షమయ్య గ్రామస్తుడు