
- కూలి పనికి పిలిచి ఘాతుకానికి పాల్పడిన నిందితుడు
- సంగారెడ్డి జిల్లా బొమ్మరెడ్డిగూడెంలో ఘటన
పుల్కల్, వెలుగు: కూలి పనికి పిలిచి గిరిజన మహిళపై లైంగిక దాడికి యత్నించి.. ఆపై గొంతు కోసి నిందితుడు పారిపోయిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఎస్ఐ క్రాంతికుమార్ కథనం ప్రకారం.. పుల్కల్ మండలం గొంగ్లూర్ తండాకు చెందిన గిరిజన మహిళ అనిత(45) సంగారెడ్డిలో అడ్డా కూలీగా పనికి వెళ్తుంది. మూడు రోజుల కింద ఆమె బస్సు దిగి ఇంటికి వెళ్లేందుకు బైక్ పై వెళ్లే వ్యక్తిని లిఫ్ట్ అడిగింది. ఆమెను బైక్ పై ఎక్కించుకుని మాటలు కలిపి ఫోన్ నంబర్ తీసుకుని బుధవారం కూలి పనికి పిలిచాడు. చౌటకూర్ వద్ద బస్సు దిగిన ఆమెను బైక్ పై ఎక్కించుకుని బొమ్మరెడ్డిగూడెం అటవీ ప్రాంతానికి తీసుకెళ్తుండగా ఎక్కడికని నిలదీసింది.
దీంతో ఆమెపై అతడు లైంగికదాడికి యత్నించాడు. ఆపై కత్తితో గొంతు కోసి ఆమె ఫోన్ తీసుకుని పారిపోయాడు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని అంబులెన్స్ లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడేండ్ల కింద భర్త చనిపోగా ఆమెకు కొడుకు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పుల్కల్ పోలీసులు తెలిపారు.