ఆదిలాబాద్‌టౌన్, వెలుగు : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేట్ పంచాయతీ కొయ్యపోశంగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళలు బుధవారం జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. పోడు భూముల సాగు విషయంలో ఈనెల 1న అటవీశాఖ అధికారులు కొయ్యపోశంగూడానికి చెందిన మద్దికుంట శైలజ, దోశన్ల సునీత, మోదితె పోశవ్వ, దోశన్ల శ్యామల, దోశన్ల లచ్చవ్వ, దోశన్ల గంగవ్వ, గుడిపెల్లి పెద్ద లక్ష్మి, గుడిపెల్లి చిన్నలక్ష్మి, జైనేని లావణ్య, మద్దికుంట రజిత, మద్దికుంట రాజవ్వ, మద్దికుంట సత్తవ్వలను అరెస్టు చేసి జిల్లా జైలుకు తరలించారు. అయితే మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు భార్య, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదివాసీ మహిళలకు బెయిల్ ఇప్పించారు. దీంతో బుధవారం అందరినీ విడుదల చేశారు. వీరికి స్వాగతం చెప్పేందుకు ఆదివాసీలతో పాటు కాంగ్రెస్ లీడర్లు తరలివచ్చారు.
జైలు నుంచి విడుదల కాగానే మహిళలంతా తీవ్ర ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ పాలిచ్చే తల్లులని చూడకుండా తిడుతూ, కొడుతూ లాక్కెళ్లారని, ఇంత అన్యాయం ఎక్కడా ఉండదన్నారు. మహిళలకు కండీషన్ బెయిల్ ఇచ్చారని, దీంతో వారం వారం ఫారెస్ట్ ఆఫీసుకు వెళ్లి సంతకాలు పెట్టి రావాల్సి ఉంటుందన్నారు. విడుదలైన మహిళలను ఏఐసీసీ మెంబర్ గండ్రత్‌సుజాత సన్మానించి చీరలు అందజేశారు. తర్వాత ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ పట్టాలిచ్చేంతవరకు ఉద్యమం ఆపేది లేదన్నారు. నాయకులు కొండ గంగాధర్, కల్చప్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి, నర్సింగ్‌రావు, కొమురం కోటేశ్,ఎమ్.సత్యనారాయణ, బి.మల్లేశ్, ఏ.అశోక్, గంగమల్లు, పొచ్చన్న, రూపేష్ రెడ్డి పాల్గొన్నారు.
త్వరలో పోరు గర్జన
పసిపాపల తల్లులు అనే కనికరం కూడా లేకుండా జైల్లో పెట్టించడం చూస్తుంటే ప్రభుత్వానికి ఆదివాసీలపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. కొయ్యపోశంగూడ ఆదివాసీలకు పట్టాలివ్వాలి. లేకపోతే రాష్ర్ట వ్యాప్తంగా పోడు ఉద్యమం చేస్తాం. పోరు గర్జన పేరుతో పాదయాత్ర చేపడతాం.
- కోవ దౌలత్‌రావు మోకాశ, ఆదివాసీ సేన రాష్ర్ట అధ్యక్షుడు
పోరాటం ఆపం
2002 నుంచి భూమి సాగు చేసుకుంటున్నాం. గతంలో 19 మందిపై, ఇపుడు 12 మందిపై కేసులు పెట్టారు. పొట్టకూటి కోసం వారసత్వంగా వస్తున్న భూమిలో సాగు చేసుకుంటుంటే కొట్టి, తన్ని హింసించారు. కేసులు పెట్టి జైలుకు పంపారు. ఈ రాష్ట్రంలో మహిళలకు ఎంత గౌరం ఇస్తున్నారో తెలిసిపోయింది. పోడు భూములకు పట్టాలిచ్చేంత వరకు మా పోరాటం ఆపేది లేదు.
- దోశన్ల శ్యామల, విడుదలైన మహిళ
పట్టాలివ్వాల్సిందే
మా తండ్రుల కాలం నుంచి భూములను సాగు చేసుకుంటున్నం. 2004 నుంచి నా భర్తపై, నాపై, మా కుటుంబసభ్యులపై అటవీ అధికారులు కేసులు పెడుతున్నారు. మాకు ఈ భూమి తప్ప వేరే దిక్కు లేదు. వారం రోజులుగా జైల్లో ఉంచారు. ఇంటి నుంచి వచ్చేటపుడు ఇంట్లో కనీసం దోసెడు బియ్యం కూడా లేవు. నాకు ఐదేండ్ల కూతురు ఉంది. నేను జైలులో ఉంటే పాపను పట్టించుకునేవారు లేకుండా పోయారు. భూములిచ్చేంత వరకు పోరాడతా. రేంజ్ అధికారి రత్నాకర్‌రావు నన్ను బూతులు తిట్టాడు. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలి
- దోశన్ల సునీత, ఆదివాసీ మహిళ
ఎన్ని కేసులు పెట్టినా భయపడం
మా భూమిలో పుల్లలు ఏరుకుంటే రేంజ్‌ఆఫీసర్ రత్నాకర్‌రావు చెట్లు నరికినట్లు మాపై కేసులు పెట్టారు. మాతో అసభ్యంగా ప్రవర్తించాడు. మాపై ఎన్ని కేసులు పెట్టినా భూములను వదిలి పెట్టేది లేదు. మా భూములకు పట్టాలివ్వాలి.
- మోదితె పోశవ్వ