- ఓట్ల కోసం మమ్మల్ని బలి చేస్తరా?
- ఎస్టీ జాబితాలో మరో 11 కులాలను ఎట్ల చేరుస్తరు.. రాష్ట్ర సర్కార్ పై ఆదివాసీల ఫైర్
ఆదిలాబాద్/భద్రాచలం, వెలుగు: ఓట్ల కోసం తమను బలి చేస్తున్నారని రాష్ట్ర సర్కార్ పై ఆదివాసీలు మండిపడ్డారు. ఎస్టీ జాబితాలో మరో 11 కులాలను చేరుస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ తీర్మానంతో పాటు పోడు పట్టాలకు షరతులు విధించడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివాసీలు సోమవారం ఆందోళన చేశారు. తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఉట్నూర్ ఐటీడీఏ ఆఫీసును ముట్టడించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆదివాసీలు మొదట ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆ తర్వాత లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
లోపలికి దూసుకెళ్లిన ఆదివాసీలు.. ఐటీడీఏ ఆఫీస్‌తో పాటు అక్కడే ఉన్న ఏటీడబ్ల్యూ చైర్మన్ కారుపై దాడి చేసి అద్దాలు పగుల గొట్టారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వచ్చి ఆదివాసీలను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఆందోళన విరమించలేదు. అటు రోడ్డుపైనా సైతం ఆదివాసీలు బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఆందోళన కొనసాగింది. చివరకు ఉట్నూర్ ఐటీడీఏ ఇన్ చార్జ్ పీవో, నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి అక్కడికొచ్చి ఆదివాసీలకు నచ్చజెప్పారు. గిరిజనులకు ప్రభుత్వం గిరిజన బంధు ఇస్తుందంటూ పథకాల గురించి చెప్పే ప్రయత్నం చేయగా, ఆదివాసీలు మరింత ఆగ్రహానికి గురయ్యారు. సీఎం కేసీఆర్ మాటలను అధికారులు వల్లె వేయొద్దంటూ హెచ్చరించారు. ఆందోళన తీవ్రం కావడంతో వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో ఆదివాసీలు ఆందోళన విరమించారు.
ఆదివాసీలను మోసం చేసే కుట్ర: పోచయ్య
ఇన్నేండ్లు పోడు పట్టాలిస్తామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు షరతులు పెట్టి ఆదివాసీలను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు పోచయ్య మండిపడ్డారు. అఖిలపక్ష నాయకులు సంతకాలు పెడితేనే పోడు పట్టాలిస్తామని చెప్పడం దారుణమన్నారు. ఆదివాసీలను అడవులకు శత్రువులుగా, అరాచకవాదులుగా కేసీఆర్ భావిస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘‘1976లో ఎస్టీ జాబితాలో లంబాడాలను కలిపారు. దీంతో అప్పటికే ఉన్న 9 తెగలకు అన్యాయం జరిగింది. రిజర్వేషన్లలో 90 శాతం ఫలాలు లంబాడాలకే దక్కుతున్నాయి. ఇప్పుడు మళ్లీ 11 కులాలను ఎస్టీ జాబితాలో కలపాలని చూస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం” అని అన్నారు.
ఉద్యమం ఉధృతం చేస్తం: నాగేశ్వరరావు
ఎస్టీ జాబితాలో మరో 11 కులాలను చేరుస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో భద్రాచలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి ఐటీడీఏ వరకు ర్యాలీ చేసి, ఏపీవో జనరల్ డేవిడ్‌రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పరిషత్ జాతీయ అధ్యక్షుడు దాట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఓట్ల కోసం ఆదివాసీలను బలి ఇస్తోందని మండిపడ్డారు. దీనిపై గిరిజన ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే ఆ తీర్మానాన్ని రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గిరిజన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఆదివాసీల డిమాండ్స్ ఇవీ..
ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలి. ఎస్టీ జాబితాలో మరో 11 కులాలను చేరుస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానం రద్దు చేయాలి. ఎలాంటి షరతులు లేకుండా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. పెసా, 1/70 చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఆదిలాబాద్ జిల్లాలోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఆదివాసీలకు ఆదివాసీ బంధు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి. ఆదివాసీ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. స్పెషల్ డీఎస్సీ వేయాలి.