భద్రాచలం, వెలుగు : మావోయిస్టుల కంచుకోట, చత్తీస్గఢ్ దండకారణ్యంలో ఆదివాసీలు స్వయంగా వంతెనను నిర్మించుకుంటున్నారు. ఆదివాసీ ఇంజినీర్లు అడవుల నుంచి పెద్ద కర్రలను తీసుకొచ్చి నిర్మించుకుంటున్న ఈ వంతెన వారి దారి కష్టాలకు చెక్ పెడుతుందని ఆశిస్తున్నారు. దంతెవాడ–-బీజాపూర్ జిల్లాల బార్డర్లోని మంగనార్-, తులార్ గుఫా గ్రామాల మధ్య ఇంద్రావతి నది ప్రవహిస్తుంది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో అక్కడకు ఆఫీసర్లు వెళ్లలేని పరిస్థితి. వర్షాకాలంలో నది పొంగితే ఈ గ్రామాల మధ్య రాకపోకలు ఉండవు.
రోగమొస్తే వైద్యం అందక గ్రామాల్లోనే ప్రాణాలు విడవాల్సి వస్తోంది. నది దాటే సమయంలో పలువురు గల్లంతు అవుతున్నారు. పండించిన పంటలను తీసుకెళ్లి అమ్ముకోవడానికి కూడా దారిలేదు. ఈ పరిస్థితుల్లో మంగనార్, తులార్గుఫా గ్రామాల రైతులు, యువకులు కలిసి వంతెన నిర్మాణానికి ముందుకొచ్చారు. అడవుల నుంచి తెచ్చిన తీగజాతి నారతో కర్రలు పాతి పిల్లర్లను నిర్మించారు.
ఇందులో రాళ్లు నింపారు. దీనితో ఇవి చాలా బలంగా ఉంటాయి. వాటిపై గ్రామాల్లో పాడై పోయిన సిమెంట్ విద్యుత్ స్తంభాలతో పాటు, అడవి నుంచి తెచ్చిన భారీ కర్రలు, మొద్దులను పిల్లర్లపై ఉంచి, పట్టుకుని నడవడానికి వీలుగా తాడు కట్టారు. ప్రస్తుతం పండించుకున్న ధాన్యాన్ని ఈ వంతెన దాటించి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ వంతెన 20 గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆదివాసీలు పేర్కొంటున్నారు.