భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్యంలోని గిరిజన గ్రామాల మధ్య కొన్నేండ్లుగా సరైన రోడ్లు, బ్రిడ్జిలు లేకపోవడంతో ఆదివాసీలు నానా అగచాట్లు పడుతున్నారు. నాయకులు పట్టించుకోకపోవడం, అధికారుల నిర్లక్ష్యంతో దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారు. దుమ్ముగూడెం మండలం సింగవరం-, ఎన్.లక్ష్మీపురం గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మించేందుకు ఐటీడీఏ 2019లో రూ.కోటి కేటాయించింది. నిర్మాణం పూర్తయితే తమ కష్టాలు తీరుతాయని ఆదివాసీలు సంబురపడ్డారు. కానీ అది మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. వాగు చరిత్రను తెలుసుకోకుండా ట్రైబల్వెల్ఫేర్ఇంజనీర్లు లోలెవల్చప్టా కట్టేందుకు ప్లాన్రూపొందించారు. ఛత్తీస్గఢ్వైపు నుంచి వచ్చే పెద్దవాగు వానా కాలంలో ఉధృతంగా ప్రవహిస్తుందని, హైట్పెంచి కట్టకపోతే ఉపయోగం ఉండదని ఎన్.లక్ష్మీపురం, సింగారం, వైట్‍నాగారం, పౌలూరుపేట గ్రామాల ప్రజలు మొత్తుకున్నా వినిపించుకోలేదు.
ముందుచూపు లేకుండా, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అదే ఏడాది మే నెలలో చప్టా నిర్మాణాన్ని పూర్తిచేశారు. గిరిజనులు చెప్పినట్లే తర్వాత కురిసిన భారీ వర్షాలకు లోలెవల్చప్టా కొట్టుకుపోయింది. సదరు కాంట్రాక్టర్‍ను బ్లాక్ లిస్టులో పెట్టి ఐటీడీఏ చేతులు దులుపుకుంది. వాగు దాటే పరిస్థితి లేకపోవడంతో నాలుగు గ్రామాల గిరిజనులు 15 కిలోమీటర్లు చుట్టూ తిరిగి మండల కేంద్రానికి వెళ్తున్నారు. ఎన్.లక్ష్మీపురం గ్రామస్తులు 2 కి.మీ. దూరంలో ఉన్న సింగారం వెళ్లేందుకు 15 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. రేషన్, నిత్యవసరాలు, వైద్యం కోసం వానల టైంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింగవరం-, ఎన్.లక్ష్మీపురం గ్రామాల మధ్య ఉన్న పెద్ద వాగుపై తిరిగి వంతెన నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రపోజల్స్పంపించామని ట్రైబల్వెల్ఫేర్ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటికే రోడ్డు నిర్మాణానికి రూ.80లక్షలు మంజూరయ్యాయని వెల్లడించారు.
అలాగే చర్ల మండలంలోని కుర్నపల్లి-, రామచంద్రాపురం గ్రామాల మధ్య ఉన్న పగిడివాగు వానల టైంలో ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఛత్తీస్‍గఢ్ సరిహద్దులోని రామచంద్రాపురంలో 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. పగిడివాగు పొంగితే ఆ ఊరికి దాదాపు మూడు నెలలపాటు రాకపోకలు బంద్అవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వాగులో కొంత దూరం ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడిచి, మధ్యలో ఉండే మర్రిచెట్టు ఊడలు ఆసరగా గిరిజనులు ఒడ్డుకు చేరుకుంటున్నారు. ఏ నాయకుడూ తమను పట్టించుకోవడం లేదని, ఎన్నికల టైంలో ఓట్ల కోసం మాత్రమే వస్తున్నారని గ్రామ పటేల్ముసికి ఇంగయ్య ‘వెలుగు’ ప్రతినిధితో చెప్పి వాపోయారు. రోగం వచ్చినా, రొప్పు వచ్చినా పగిడివాగు దాటితేనే వైద్యం అని ఆవేదన వ్యక్తం చేశారు.