తోపులాటలో సర్వేయర్​ గోల్డ్​ చైన్, సెల్​ఫోన్​ మాయం

మెదక్/పెద్ద శంకరంపేట, వెలుగు: భూ సర్వేకు వెళ్లిన అధికారులపై గిరిజనులు దాడి చేశారు. మెదక్ కు చెందిన మన్నె సుదర్శన్​అనే వ్యక్తికి పెద్ద శంకరంపేట మండలం కట్టెల వెంకటాపూర్ శివారులోని సర్వే నంబర్ 55, 56లో 4  ఎకరాల 36 గుంటల భూమి ఉంది. పక్క భూమి వారితో హద్దు పంచాయతీ ఏర్పడటంతో సర్వే చేసి తన భూమికి సంబంధించిన బౌండరీలను చూపించాలని అధికారులకు దరఖాస్తు చేశాడు. శుక్రవారం డీఐఏ శశికుమార్, పెద్దశంకరంపేట ఆర్ఐ ప్రభాకర్, సర్వేయర్ సుల్తానా బేగం సర్వే నంబర్ 55లోని భూమి వద్దకు చేరుకొన్నారు. ఇది తెలిసి రఘవాని తండావాసులు అక్కడికి వచ్చి సర్వేను అడ్డుకోవడంతోపాటు అధికారులపై దాడికి పాల్పడ్డారు. గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గొడవకు దిగడంతో అధికారులు అక్కడి నుంచి తహసీల్దార్​ ఆఫీస్​కు వెళ్లిపోయారు. 

ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో తన తులంనర బంగారు గొలుసు, సెల్​ఫోన్​ పోయాయని సర్వేయర్ సుల్తానా బేగం చెప్పారు. ప్రైవేటు ఆపరేటర్ కారు అద్దాలు కూడా తండావాసులు పగలగొట్టారని ఆర్ఐ ప్రభాకర్ చెప్పారు.  విషయం తెలుసుకున్న అల్లాదుర్గం సీఐ జార్జ్ ఆధ్వర్యంలో పెద్దశంకరంపేట పోలీసులు సంఘటన స్థలానికి గిరిజనులను శాంతింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము గత 50 ఏళ్లుగా ఇక్కడే వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నామని, తమ పట్టా భూములను కొందరు లాక్కోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  గిరిజనులు దాడి చేయడంపై ఆర్ఐ ప్రభాకర్, సర్వేయర్ సుల్తానా బేగం పెద్దశంకరపేట పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. 34 మంది తండావాసులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై అశోక్ చెప్పారు.