అటవీ అధికారులను అడ్డుకున్న ఆదివాసీలు

అటవీ అధికారులను అడ్డుకున్న ఆదివాసీలు

కడెం, వెలుగు: నిర్వాసితుల కోసం వ్యవసాయ భూమి కొలతలు తీస్తున్న అటవీ శాఖ అధికారులను ఆదివాసీలు అడ్డుకున్నారు. నిర్మల్​ జిల్లా కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ శివారులో ఉన్న అటవీ భూమిలో మైసంపేట్, రాంపూర్ గ్రామాల నిర్వాసితుల కొరకు అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారులు వ్యవసాయ భూమికి కొలతలు తీస్తుండగా.. నచ్చన్ ఎల్లాపూర్ ఆదివాసీ గిరిజనులు వారిని అడ్డుకున్నారు. గతంలో సంబంధిత భూమిని తాము చదును చేసుకొని వ్యవసాయం చేశామని, ఇందుకు తమపై కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు.

ఆ భూమిని తమకే కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో ఖానాపూర్ డివిజనల్ అటవీ శాఖ అధికారి భవాని శంకర్, సీఐ మోహన్ గిరిజనులతో చర్చలు జరిపారు. చర్చల అనంతరం తాత్కాలికంగా కొలతలకు గిరిజనులు ఒప్పుకున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ఏడీ రాథోడ్ సుదర్శన్, ఎమ్మార్వో సుజాత, ఎస్​ఐ కృష్ణ సాగర్ రెడ్డి, ఎఫ్ఆర్ఓలు, డీఆర్ఓలు, తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.