ఆదివాసీల బతుకులు ఆగమైతున్నయ్​

ఉనికి కోల్పోయే పరిస్థితుల్లో ఆదివాసీలు

అడవి తల్లి ఒడిలో జీవించే ఆదివాసీలు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారు. అటవీ భూములు, సహజ వనరులపై ఆధారపడి జీవించే గిరిజనులకు మేలు చేయాల్సిన పాలకులు.. వారిని ఇంకింత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అడవిలో మొక్కలు నాటే నెపంతో.. భూములు గుంజుకోవడం, పంటలు ధ్వంసం చేయడం, నివాసాలు ఖాళీ చేయిస్తూ.. వారి హక్కులను కాలరాస్తున్నారు. తమకు అన్యాయం చేయొద్దని ప్రశ్నించే ఆదివాసీలపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. అడవి బిడ్డల హక్కుల రక్షణకు గతంలో ఎన్నో చట్టాలు వచ్చినా అవేవీ అమలు కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆదివాసీల హక్కులను కాపాడాలి.   
ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో దాదాపు 40 కోట్ల ఆదివాసీల జనాభా ఉంది. ఏడు వేలకు పైగా భాషలు, 5 వేలకు పైగా విభిన్న సంస్కృతులు ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రకృతితో పెనవేసుకున్న పర్యావరణహిత సాంప్రదాయాలు ఆదివాసీ జీవనశైలిలో అంతర్భాగం. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీలు తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. అటవీ భూములు, సహజ వనరులే వీరికి జీవనాధారం. ఐక్యరాజ్యసమితి క్షేత్రస్థాయిలో వివిధ ప్రభుత్వ వ్యవస్థల్లో ఆదివాసీల హక్కులకు రక్షణ కవచాలు ఏర్పాటు చేశాయి. కానీ అవి వారి హక్కులను పూర్తి స్థాయిలో కాపాడటం లేదు. అభివృద్ధి, ఇతర అవసరాల పేరుతో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములు ప్రభుత్వాలు, అధికారులు లాక్కోవడం పరిపాటిగా మారుతోంది. సహజ వనరులు కోల్పోవడం వల్ల వారి ఉనికి ప్రమాదంలో పడటంతో ఆదివాసీ కుటుంబాలు ఉపాధి, విద్య, ఆర్థిక అవసరాల కోసం నగరాలకు వలస పోతున్నాయి. నగర జీవనంలో వీరికి కనీస పౌర సేవలు అందడం లేదు. ఇండియాలో 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 8.6 శాతం అంటే 10.42 కోట్ల ఆదివాసీలు ఉన్నారు. ఇందులో 461 రకాల ఆదివాసి తెగలు ఉన్నాయి. వీరిలో 90 శాతం గిరిపుత్రులు అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం, వేట, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పథకాలు అమలు చేస్తున్నా వారి పరిస్థితిలో మార్పు రావడం లేదు. అత్యంత వెనకబడిన ఆదివాసీ తెగలు(పీటీజీ) నివసించే ప్రాంతాల్లో రహదారులు కూడా లేవు. మంచినీరు, ఆరోగ్య సేవలు, విద్య తదితర సౌకర్యాలకు దూరంగా వారు దుర్భరమైన జీవితం సాగిస్తున్నారు. 
చట్టాలు ఉన్నా..
గతంలో ఆదివాసీల హక్కులపై అనేక పోరాటాలు వచ్చాయి. వీటి ఫలితంగానే ప్రభుత్వం1/70 పీసా చట్టం చేసింది. ఆనాటి యూపీఏ ప్రభుత్వం 2005లో అటవీ హక్కుల చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం.. షెడ్యూల్డ్ తెగలు, తరతరాలుగా అడవిలో నివసిస్తున్న సంప్రదాయక అటవీ వాసులకు అటవీ భూములపై హక్కులు ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టం 1967 ప్రకారం.. సెక్షన్ 4 ప్రకటించే నాటికి ఉన్న హక్కులు గుర్తించబడతాయి. భారత అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం.. 2005 డిసెంబర్ 13 వరకు ఆక్రమణలో ఉన్న భూములపై ఆదివాసీలకు హక్కులు ఉంటాయి. ఇతర సంప్రదాయక అటవీ వాసులు అయితే 13 డిసెంబర్ 2005 ముందు మూడు తరాలు అంటే 75 ఏళ్లు అదే అడవిలో నివసిస్తూ జీవిస్తున్న వారికి హక్కులు సంక్రమిస్తాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన షెడ్యూలు తెగలైతే ఆ తేదీ నాటికి నివసిస్తే చాలు. వ్యక్తులకు సమాజానికి ఇలాంటి అటవీ హక్కులు ఏ మేరకు ఉన్నాయో నిర్ణయించే ప్రక్రియ ప్రారంభించే అధికారం గ్రామసభలకు మాత్రమే ఉంటుంది. అటవీ హక్కులు పొందాలంటే 13 డిసెంబర్  2005 నాటికి భూమి ఆక్రమణలో ఉన్నట్టు చూపాలి. ప్రభుత్వ డాక్యుమెంట్లు గానీ, ప్రభుత్వ రికార్డులు గానీ, ఏదైనా సెటిల్​మెంట్, మ్యాపు, గూగుల్ మ్యాపు, వర్కింగ్ ప్లానులు, అటవీ ఎంక్వయిరీ రిపోర్టు లాంటిది ఆధారాలుగా చెల్లుతాయి. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, ఇంటి పన్ను రసీదు, ఇంటి నివాస సర్టిఫికెట్, కోర్టు ఆర్డర్, సర్వే రిపోర్టు, సంస్థానాలు ఇచ్చిన సర్టిఫికెట్లు, వంశ వృక్షాలు గ్రామ పెద్దల స్టేట్​మెంట్​ఇలా అన్ని ఆధారాలుగా చూపవచ్చు. అటవీ హక్కుల చట్టం 2005–-06 ప్రకారం ప్రతి ఆదివాసి కుటుంబానికీ పది ఎకరాల పట్టా ఇవ్వాలి. ఆ ప్రకారం రాష్ట్రంలో 1.78 లక్షల ఎకరాలు లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత చట్టాలను అమలు చేయకుండా పక్కన పెట్టేశారు. పైగా ఆర్వో/ఎస్ఆర్ చట్టాలు ఇచ్చిన భూములను సైతం ప్రస్తుతం లాక్కుంటున్న పరిస్థితి నెలకొంది. వందలాది ఆదివాసీల మీద అక్రమ కేసులు నమోదవుతున్నాయి. 
ప్రభుత్వ నియంతృత్వం..
గిరిజనులు సాగుచేస్తున్న భూమిపై ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. అటవీ అధికారులు, ప్రభుత్వం ఆదివాసీల పోడు భూములపై  యుద్ధం ప్రకటించారు. వారిని భూముల నుంచి వెళ్లగొట్టడానికి కందకాలు తవ్వుతున్నారు. పచ్చని పంటలను ధ్వంసం చేస్తున్నారు. ఆ పేద బతుకులపై యుద్ధం చేస్తూ ప్రభుత్వం హరితహారం పేరుమీద మొక్కలు నాటుతోంది. తమ భూముల్లో మొక్కలు పెట్టి జీవనాధారం నాశనం చేయొద్దంటూ ఆదివాసీ బిడ్డలు ఫారెస్ట్​ఆఫీసర్ల కాళ్లు మొక్కుతున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం తమను అడ్డుకుంటున్నారన్న నెపంతో గిరిజనుల మీద కేసులు పెడుతున్నారు. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఆదిలాబాద్, మహబూబ్​నగర్, వరంగల్ తదితర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. ఆఫీసర్ల వేధింపులు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 31 లక్షల 75 వేల మంది ఆదివాసీలు ఉన్నారు. ఆదివాసీల్లో ఉప తెగలు చాలా ఉన్నాయి. గత పాలకులతో పాటు ఇప్పుడు ఉన్న పాలకులు వాళ్లను సాటి మనుషులుగా చూడకపోవడం మాట అటుంచితే.. వారి వనరులు దోచుకోవడం, ఆవాసాలను, భూములను లాక్కోవడం దారుణం.
హరితహారం పేరుతో..
పట్టాల కోసం ఆదివాసీలు అధికారులు, కోర్టుల చుట్టూ తిరుగుతుంటే, తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో వారు సాగు చేస్తున్న భూమిలో మొక్కలు నాటిస్తోంది. రాష్ట్రంలో 33 శాతం అడవి పెంచాలని ప్రభుత్వం అనుకుంటోంది. ప్రపంచ బ్యాంకు నిధులు రూ. 240 కోట్లతో మొక్కలకు శ్రీకారం చుట్టింది. ఈ లక్ష్యం మంచిదే అయినా.. ఈ హరితహారం ఆదివాసీలపై యుద్ధంలా మారుతోంది. ఫారెస్టు అధికారులు అత్యుత్సాహంతో గిరిజనులపై దాడులు చేస్తున్నారు. కందకాలు తీస్తున్నారు. ఇక పంటలు ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వందలాది ఆదివాసీలపై కేసులు నమోదయ్యాయి. కొందరిని అరెస్టు కూడా చేశారు. మహిళలు, వృద్ధులు అని చూడకుండా వారిపై దాడులు చేస్తున్నారు. గుండాల మండలం జగ్గయ్య గూడెంలో ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్న భూముల్లో అధికారులు దాడులు చేశారు. సిర్పూర్ కాగజ్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అటవీశాఖ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆదివాసీ చట్టాలు నిర్వీర్యం అవుతున్నాయి. పోలీసులు, కోర్టుల గురించి స్పష్టంగా తెలియని ఆదివాసీలు భయంతో వందలాది ఎకరాలు భూములు కోల్పోతున్నారు. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకొని పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని గతంలో చెప్పారు. ఇంతవరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆదివాసీల భూములకు పట్టాలు ఇవ్వడంతోపాటు,  ధరణి వెబ్ సైట్​లో నిషేధిత జాబితాలో ఉన్న28 లక్షల ఎకరాలను అందులోంచి తీసేయాలి. లేదంటే రాష్ట్రం కోసం కొట్లాడిన ఆదివాసీలు, గిరిజనులు మరో జల్, జంగల్, జమీన్ పోరాటానికి సిద్ధమవుతారు. -మన్నారం నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ లోక్ సత్తా పార్టీ.