సత్తుపల్లి, వెలుగు: పోడు భూముల్లో అటవీ అధికారులు పంటను ధ్వంసం చేశారని శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం తెల్లవారుజామున 50 ఎకరాల్లో పంటను ధ్వంసం చేశారని ఆరోపించారు. సత్తుపల్లి తామర చెరువు శివారులో సుమారు 100 ఎకరాల పోడు భూమిని గుడిపాడుకు చెందిన నాయక పోడు గిరిజనులు సాగు చేసుకుంటున్నారు.
అయితే 75 ఎకరాల భూమికి పట్టాలు ఇచ్చారని, మిగిలిన 25 ఎకరాల భూమికి పట్టాలు రాకుండా గతంలో ఇక్కడ పనిచేసిన రేంజర్ వెంకటేశ్వర రావు అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ భూముల్లో వేసిన జొన్న, కంది, బొబ్బర్లు, జీడి మొక్కలను ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేశారని అన్నారు. అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ పీఎస్లో గిరిజనులు ఫిర్యాదు చేశారు.
అంతకుముందు గిరిజనులు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ధ్వంసం చేసిన పంట మొక్కలతో ధర్నా నిర్వహించి డీటీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రజా పంథా నాయకులు దుర్గ, పార్వతి, వెంకటేశ్వరరావు, ఆదినారాయణ, వీరస్వామి, రవి, రజిని, రమణ, తదితరులు పాల్గొన్నారు.