
శివ్వంపేట, వెలుగు : సేవాలాల్మహరాజ్గుడికి భూమి చూపించాలంటూ మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో గురువారం గిరిజనులు ఆందోళన చేపట్టారు. సేవాలాల్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి శివ్వంపేటకు వచ్చారు. ఈ సందర్భంగా గుడి నిర్మాణానికి అవసరమైన భూమి ఇప్పించే వరకు కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.
ఎమ్మెల్యే సునీత రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఎంత నచ్చజెప్పినా గిరిజనులు వినలేదు. గంట పాటు భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో పాటు పోలీసులు సముదాయించినా ససేమిరా అన్నారు. ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ సేవాలాల్ జయంతి రోజు రాజకీయం చేయకూడదని, ప్రశాంతంగా పండగ జరుపుకోవాలని సూచించారు. తహసీల్దార్ ఒక చోట స్థలం చూపించగా అది ఎస్సీల స్థలం అని అంటున్నారని మీకు వేరే దగ్గర స్థలం చూపిస్తామని గిరిజనులకు హామీ ఇచ్చారు.