- మొక్కలు నాటేందుకు వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్లు
- చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించిన మహిళ
కొల్లాపూర్, వెలుగు : అటవీ భూమిలో మొక్కలు నాటేందుకు వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్లను గిరిజనులు అడ్డుకున్నారు. ఆ భూమిని తాము సాగు చేసుకుంటున్నామని, మొక్కలు నాటొద్దని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎర్రగట్టు బొల్లారం గ్రామ శివారులో శనివారం జరిగింది. ఎర్రగట్టు బొల్లారం గ్రామ శివారులోని సర్వే నంబర్ 399లో 25 ఎకరాల అటవీ భూమి ఉంది. ఇందులోని మూడు ఎకరాల్లో పంట సాగు చేసేందుకు అదే గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ ప్రయత్నించింది.
ఇందులో భాగంగా ఆ మూడు ఎకరాల్లో ఉన్న చెట్లను నరికేయించింది. ఆ భూమిలో మొక్కలు నాటేందుకు శనివారం అటవీ సిబ్బంది వచ్చారు. విషయం తెలుసుకున్న చంద్రకళ భూమి వద్దకు వచ్చి మొక్కలు నాటకుండా ఆఫీసర్లను అడ్డుకుంది. దీంతో అటవీ సిబ్బంది, మహిళా రైతుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో చంద్రకళ సమీపంలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన ఫారెస్ట్ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. తన కుటుంబ జీవనాధారం కోసం భూమి ఇవ్వాలని చంద్రకళ ఫారెస్ట్ ఆఫీసర్ల కాళ్లపై పడి వేడుకుంది. తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్లు మొక్కలు నాటి వెళ్లిపోయారు.