రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే తరఫున ఆదివాసీ మహిళ అయిన ద్రౌపది ముర్మును ప్రకటించడం పట్ల గిరిజనులు సహా దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రోరల్ కాలేజీలో ఎన్డీయేకు 58 శాతం ఓట్లు ఉన్నందున ఆమె గెలుపు లాంఛనమే. కాగా ఆదివాసీ మహిళ భారత కొత్త రాష్ట్రపతి కానున్నారు. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ‘‘భారత ప్రజాస్వామ్యం అత్యుత్తమ ప్రజాస్వామ్యం. ఇందులో ప్రజలే ప్రభువులు. సామాన్యులు కూడా అత్యున్నత స్థాయి పదవులు చేపట్టే అవకాశం ఉంది. ఇందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ’’ అని ఒక సందర్భంలో చెప్పారు. ఆ తరహాలో పేద ఎస్టీ కుటుంబంలో పుట్టిన మహిళ రాష్ట్రపతిగా ఎంపిక కానున్నారు. భారత ప్రజాస్వామ్యం మేడి పండు ప్రజాస్వామ్యం. మన రాజ్యాంగం అతుకుల బొంత రాజ్యాంగం. మన చట్టాలు కొంతమందికి చుట్టాలు అంటూ నిర్వేదం వ్యక్తం చేస్తున్నవారికి ముర్ము ఎంపిక ఓ సమాధానమైంది.
గతంలో కూడా..
సహజంగా పదవులు అనగానే పైరవీలు, కులాలు, మతాల సమీకరణలనే వాటి చుట్టూ.. తిరుగుతూ ఆధిపత్యం చెలాయించేవారి మాట చెల్లుబాటు కావడం భారత రాజకీయాల్లో ఉన్నదే. కృష్ణకాంత్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్నప్పుడు ‘ఉపరాష్ట్రపతిగా మీ పేరు పరిశీలనలో ఉందని వార్తలు వస్తున్నాయి’ అని ఓ పాత్రికేయుడు ప్రశ్నించాడు. అందుకు ఆయన స్పందిస్తూ..‘మనం అంతపెద్ద పదవిలోకి పోవాలంటే చాలా ల్యాబీ నడపాలి. అందుకు తగినట్లుగా రాజకీయ పార్టీల అండదండలు, కులాల మద్దతు నాకు లేదు, ఆ పదవి నాకు రాదు’ అని నిక్కచ్చిగా చెప్పారు. అయితే.. ఆ తరువాత నాలుగైదు రోజులకే ఉన్నట్టుండి ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఉపరాష్ట్రపతిగా ఎంపికయ్యారు. అదే సమయంలో కె.ఆర్.నారాయణన్ అనే దళిత మేధావిని నాటి పాలకులు రాష్ట్రపతిగా ఎంపిక చేశారు. ఆయన అనేక పట్టాలు పొందిన మేధావిగా, రాష్ట్రపతి పదవిని అలంకరించిన మహోన్నత వ్యక్తిగా రాణించారు. పదవీ విరమణ అనంతరం తనకంటూ పెద్దగా ఏమీ సంపాదించుకోకుండా, దాచుకోకుండా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌తోనే కాలం గడిపారు. మాజీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధులు హైదరాబాదులో ఓ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించగా.. విమాన చార్జీలు మీరే భరించుకోవాలని, తన దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదని నిర్మొహమాటంగా చెప్పారు. అప్పట్లో ఈ విషయాలు బయటికి పొక్కి పెద్ద సంచలనం సృష్టించాయి. అప్పుడు సోషలిస్ట్ మేధావి అయిన కృష్ణకాంత్ కు, దళిత మేధావి అయిన నారాయణన్‌కు అవకాశం కల్పించినట్లుగా నేటి పాలకులు ఓ గిరిజన మహిళకు, ఓ మన్నెం కాగడాకు అవకాశం కల్పించడం పట్ల పాలకుల ఆలోచనా విధానంతోపాటు భారత ప్రజాస్వామ్యం ఔన్నత్యాన్ని మెచ్చుకోవాలి. పేద కుటుంబంలో జన్మించి టీచర్ గా పనిచేసి, తర్వాత కౌన్సిలర్ గా, మంత్రిగా, గవర్నర్ గా ఎదిగిన ద్రౌపది ముర్ము.. ఓర్పు, నేర్పు నేటి మహిళలకు స్ఫూర్తిగా నిలవాలి.
భిన్నత్వంలో ఏకత్వం..
ఇంతవరకు అగ్రకులాలకు చెందినవారితోపాటు దళిత మేధావులు, ముస్లిం మైనార్టీ వర్గాల వారు భారత రాష్ట్రపతులుగా కొనసాగారు. మహిళలకు సంబంధించి గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రతిభా పాటిల్‌కు అవకాశం కల్పించింది. మహిళల ప్రాతినిధ్యం పరంగా చూస్తే.. ద్రౌపది ముర్ము రెండో మహిళా రాష్ట్రపతి కానుండగా, ఆదివాసీల తరఫున మొదటి రాష్ట్రపతి కానున్నారు. భిన్నత్వంలో ఏకత్వం గల సువిశాల భారతదేశంలో ఒక ఎస్టీ మహిళకు ఇలాంటి అవకాశం రావడం మంచి పరిణామం. గతంలో ఉపరాష్ట్రపతులుగా కొనసాగిన వారిని రాష్ట్రపతిగా ఎంపిక చేస్తున్న సాంప్రదాయాన్ని, ప్రస్తుతం పదవిలో ఉన్నవారిని మరోసారి కొనసాగించే విధానాన్ని పక్కనబెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వడం ఆహ్వానించదగిన మార్పు. బలహీనవర్గాలకు ప్రాధాన్యతనివ్వాలి అనే ఆలోచనతోనే ద్రౌపతి ముర్మును ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది.
-
తిప్పినేని రామదాసప్పనాయుడు
ఛైర్మన్, ముద్ర అగ్రికల్చర్ & స్కిల్ డెవలప్మెంట్
మల్టీస్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్