- డిసెంబర్లోనే పూర్తి కావాల్సిన ప్రక్రియ.. ఇంకా షురూ కాలే..
- ఈ నెలాఖరులోపు ఫ్రూనింగ్కంప్లీట్కావాల్సి ఉంటుంది..
- పట్టించుకోని అటవీశాఖ అధికారులు
- ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కార్మికులు
- వేసవిలో గిరిజనులకు ప్రధాన ఉపాధి ఇదే..
భద్రాచలం, వెలుగు : తునికాకు టెండర్ల నిర్వహణపై డిలే కొనసాగుతోంది. అటవీ శాఖ ఏటా డిసెంబర్లోనే తునికాకు సేకరణ కోసం టెండర్లు నిర్వహిస్తుంది.. కానీ ఈసారి జనవరి ముగిసినా ఇప్పటి వరకు టెండర్ల ప్రక్రియపై నోరుమెదపడం లేదు. ఫిబ్రవరి నెలాఖరులోపు కొమ్మకొట్టుడు(ఫ్రూనింగ్) పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెల రోజులకు తునికాకు సేకరణ ప్రారంభమవుతుంది.
మరో వైపు తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లలో తునికాకు సేకరణకు టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. ఏపీలో 50 ఆకుల కట్టకు రూ.3.70 ధర కూడా నిర్ణయించారు. తెలంగాణలోనే ఇంకా షురూ కాలేదు. దీంతో తునికాకు సేకరించే గిరిజన కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
ఏటా 20వేల మంది కార్మికులకు ఉపాధి
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భద్రాచలం, ఇల్లెందు, మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ డివిజన్లలో 36 తునికాకు యూనిట్లు ఉన్నాయి. 656కుపైగా కల్లాలు ఉన్నాయి. ఏటా 20వేల మంది కార్మికులు తునికాకు సేకరణ ద్వారా ఉపాధి పొందుతున్నారు. పక్క రాష్ట్రాల్లో తునికాకు సేకరణకు టెండర్ల ప్రక్రియ పూర్తయినందున తెలంగాణలో కూడా త్వరగా టెండర్లు పిలవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ఆందోళన బాట..
సీపీఎం అనుబంధ వ్యవసాయ కార్మిక, గిరిజన సంఘాలు కూడా కార్మికులతో కలిసి ఆందోళన బాటపట్టాయి. సకాలంలో కొమ్మకొట్టుడు పనిచేస్తేనే నాణ్యమైన ఆకు వస్తుందని, ఆలస్యమైతే నష్టం జరుగుతుందని కార్మికులు వాపోతున్నారు. మరోవైపు కొమరం భీం జిల్లాలో తునికాకు సేకరణ నిలిపివేయాలని అటవీశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది.
పులుల సంచారం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న తునికాకు కల్లాల సంఖ్యను కుదించేందుకు అటవీశాఖ ఏమైనా కుట్ర చేస్తుందా? అని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టెండర్లు పిలవాలి
తునికాకు సేకరణకు టెండర్లు వెంటనే పిలవాలి. ఆలస్యమైతే ఆదివాసీలకు నష్టం. ఎండాకాలంలో ఆదివాసీలకు ఆదాయ వనరు తునికాకు. దీనిపై సర్కారు నిర్లక్ష్యం తగదు. తక్షణమే టెండర్లు పిలవకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం.
- కారం పుల్లయ్య, గిరిజన సంఘం నాయకుడు, దుమ్ముగూడెం
ఆన్లైన్ టెండర్ విధానం
తునికాకు సేకరణ కోసం ఆన్లైన్ టెండర్ విధానం అమలులో ఉంది. మాకు సమాచారం ఉండదు. టెండర్లు పూర్తయ్యి, అగ్రిమెంట్తర్వాతనే కాంట్రాక్టర్లు వస్తారు. అయినా దీనిపై ఉన్నతాధికారులను అడిగి తెలుసుకుంటాం.
- కిష్టగౌడ్, డీఎఫ్వో,భద్రాద్రికొత్తగూడెం