వనపర్తి, వెలుగు : వృద్ధుల పోషణపై ట్రిబ్యునల్ ఉత్తర్వులు పాటించాలని, లేనిపక్షంలో జరిమానా, జైలు శిక్ష ఉంటుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధులకు ఏమైనా సమస్యలు ఉంటే, నేరుగా ఆర్డీవోను సంప్రదించాలని, దరఖాస్తు స్వీకరించిన అనంతరం 90 రోజుల్లో వారి పిల్లలకు నోటీసులు పంపిస్తారని చెప్పారు.
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో వృద్ధుల వివరాలను సేకరించి, సీనియర్ సిటిజన్ ఆక్టివిటీ కమిటీలను ఏర్పాటు చేసి నెలకోసారి సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీడబ్ల్యూవో సుధారాణి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డీఆర్డీవో ఉమాదేవి, డీఎంహెచ్వో శ్రీనివాసులు పాల్గొన్నారు.