సెల్యూట్ పైలట్ సిద్ధార్థ్‌..హర్యానాలోని ఆయన సొంతూరులో అంత్యక్రియలు పూర్తి

సెల్యూట్ పైలట్ సిద్ధార్థ్‌..హర్యానాలోని ఆయన సొంతూరులో అంత్యక్రియలు పూర్తి
  • గుండెలవిసేలా రోదించిన పైలట్​ సిద్ధార్థ్​ ఫియాన్సీ

హర్యానా: ఇండియన్ ఎయిర్‌‌ఫోర్స్ ఫైటర్ జెట్ కూలిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పైలట్ సిద్ధార్థ్‌ యాదవ్‌(28) అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. హర్యానా రేవారి జిల్లాలోని ఆయన సొంతూరు మజ్రా భల్కి గ్రామంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని అనేక మంది మాజీ సైనికులు, ఎయిర్​ఫోర్స్ అధికారులు, వేలాదిమంది స్థానికులు అంతిమయాత్రకు తరలివచ్చి ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు.

హర్యానాకు చెందిన ఈ అమరుడి త్యాగాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదని హర్యానా సీఎం సైనీ ట్వీట్ చేశారు. అంత్యక్రియల సందర్భంగా సిద్ధార్థ్‌కు కాబోయే భార్య సానియా తల్లడిల్లిపోయారు. నన్ను తీసుకెళ్లేందుకు వస్తా అని మాట ఇచ్చావ్‌ కదా.. అంటూ సిద్ధార్థ్‌ పార్థివ దేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. ఆయన ముఖాన్ని చూపించాలంటూ అధికారులను వేడుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, పైలట్ సిద్ధార్థ్‌ మృతికి 10 రోజుల ముందే ఆయనకు సానియాతో ఎంగేజ్‌మెంట్ జరిగింది. వచ్చే నవంబర్‌‌లో వీళ్ల పెండ్లి జరగాల్సి ఉంది. ఈ లోపే 
సిద్ధార్థ్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

ఏం జరిగిందంటే.. 

.గుజరాత్‌లోని జామ్‌నగర్‌‌ ఐఏఎఫ్‌ స్టేషన్‌లో ట్రైనింగ్‌లో భాగంగా పైలట్‌ సిద్ధార్థ్‌ మరో పైలట్ మనోజ్‌కుమార్‌‌తో కలిసి ఈ నెల 3న జాగ్వార్ ఫైటర్‌‌ జెట్‌లో బయల్దేరారు. కొద్దినిమిషాల్లోనే జాగ్వార్‌‌లో సమస్య తలెత్తింది. కంట్రోల్‌ చేసేందుకు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ఇక ప్రమాదం తప్పదని తెలిశాక పైలట్లు ఎజెక్షన్‌ ప్రారంభించారు. అందులో భాగంగా పైలట్ సిద్ధార్థ్‌ ముందుగా కో పైలట్‌ మనోజ్‌ను బయటకు పంపించేశారు.

ఆపై జెట్‌ను జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లారు. ఇంతలోనే విమానం పంటపొలాల్లో కూలడంతో సిద్ధార్థ్ ప్రాణాలు కోల్పోయారు. 2016లో ఐఏఎఫ్‌లో చేరిన సిద్ధార్థ్‌.. రెండేండ్ల సర్వీస్ తర్వాత ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌గా ప్రమోషన్‌ పొందారు. సెలవుపై సొంతూరికి వెళ్లి మార్చి 23న సానియాతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అదేనెల 31న తిరిగి డ్యూటీకి వచ్చారు.