మహబూబ్‌నగర్‌టౌన్, వెలుగు: పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా శనివారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో అమర పోలీసులకు ఘనంగా నివాళులు అర్పించారు. మహబూబ్ నగర్ లోని ఎస్పీ పరదేశీనాయుడు విగ్రహానికి జోగులాంబ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ హర్షవర్ధన్ పూలమాలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. అంతకుముందు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు పరదేశీనాయుడు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ జి.రవినాయక్, ఏఎస్పీలు రాములు, వెంకటేశ్ పోలీస్ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య పాల్గొన్నారు.
అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం
వనపర్తి టౌన్: పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని వనపర్తి ఎస్పీ రక్షిత కృష్ణ మూర్తి తెలిపారు. పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ మధుసూదన్, సీసీఎస్ సీఐ రవిపాల్, మహేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి, రత్నం పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ టౌన్: శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ ఉదయ్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అమరవీరుల స్థూపం వద్ద ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఏఎస్పీ రామేశ్వర్ తో కలిసి నివాళులు అర్పించారు. అడిషనల్ ఎస్పీలు సీహెచ్ రామేశ్వర్, టి భరత్ కుమార్, డీఎస్పీలు మోహన్ కుమార్ పాల్గొన్నారు.
నారాయణపేట: పోలీస్ అమరులను స్మరించుకోవడంతో పాటు వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో అమరవీరుల స్థూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించారు. ఎస్పీ యోగేశ్ గౌతమ్, అడిషనల్ ఎస్పీ నాగేంద్రుడు, డీఎస్పీలు కె సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, సీఐలు రవిబాబు, రాంలాల్, జనార్ధన్, రాజేందర్ పాల్గొన్నారు.
గద్వాల: పోలీసు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని విధులు నిర్వహించాలని ఎస్పీ రితిరాజ్ కోరారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో 70 మంది రక్తదానం చేశారు. ఏఎస్పీ రవి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఏఆర్డీ ఎస్పీ ఇమ్మానియేల్, సీఐలు శివశంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.