పాలమూరు, వెలుగు: ఏఐసీసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 25 వేల మంది ఆదివాసీలను నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ ఆదివాసీ విభాగం అధ్యక్షులు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ తెలిపారు. పట్టణంలోని కాంగ్రెస్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 12 నుంచి 14 వరకు కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిలలో ఉమ్మడి జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఇద్దరు ఆదివాసీలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. రాజ్యాంగపరమైన హక్కులు, వాటి అమలు తీరు, లోపాలు, గిరిజన సంస్కృతిపై జరుగుతున్న దాడి తదితర అంశాలపై శిక్షణ ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి వివరిస్తామని తెలిపారు.
వచ్చే రెండేండ్లలో 5 వేల మంది గిరిజనులను నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. అంతకుముందు ఆదివాసీ విభాగం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి లింగం నాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా గిరిజన విద్యార్థి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే రథోత్సవం, ర్యాలీ, రక్తదాన శిబిరం బ్రోచర్ ను రిలీజ్ చేశారు. ఒబేదుల్లా కొత్వాల్, రాహుల్ బాల్, లింగంనాయక్, కోట్య నాయక్, గణేశ్నాయక్, జహీర్ అఖ్తర్ పాల్గొన్నారు.