- ట్రైకార్ చెర్మన్ బెల్లయ్య నాయక్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం కోసం అవసరమైన నిధులను విడుదల చేయాలని కోరుతూ త్వరలోనే రాష్ట్రపతి, ప్రధానిని కలుస్తామని ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ తెలిపారు. శనివారం ట్రైకార్ ఆఫీసులో బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఎస్టీ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, నిధుల సమీకరణపై సమావేశంలో చర్చించారు. ట్రైకార్ ద్వారా స్వయం ఉపాధి పథకం కింద సుమారు 30 వేల మంది లబ్ధిదారులు ఎంపికయ్యారని, వారందరికి సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు త్వరలో గిరిజన మేళా నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మీడియాతో మాట్లాడారు.
గత మూడేళ్లుగా బీఆర్ఎస్ సర్కారు ట్రైకార్ కు నిధులు కేటాయించలేదని, దీంతో పలు సంక్షేమ పథకాలు నిలిచిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ. 411 కోట్లను విడుదల చేసిందన్నారు. మళ్లీ ఈ సంవత్సరానికి రూ. 360 కోట్లను కేటాయించిందని, ఈ నిధులతో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో ఈ సమావేశంలో చర్చించామని బెల్లయ్య నాయక్ వెల్లడించారు.