ఆరోగ్యాన్నిచ్చే  దినసరి కీరై పొడులు!

ఆరోగ్యాన్నిచ్చే  దినసరి కీరై పొడులు!

నెలలు నిండకముందే పుట్టిన కొడుకుని హాస్పిటల్​లో చేర్చారు. 21 రోజులకు బిడ్డ ఆరోగ్యం కాస్త కోలుకుంది. తల్లి మనసు కుదుటపడింది. కానీ.. ఇంటికెళ్లాక కొడుకు ఎదుర్కొంటున్న పోషకాహార లోపాన్ని ఎలాగైనా తగ్గించాలని రకరకాల ప్రయత్నాలు మొదలుపెట్టింది లక్ష్మీ ప్రియ. వంటగదిలో స్వయంగా ఎన్నో ప్రయోగాలు చేసింది. ఆ ప్రయోగాల నుంచి పుట్టిన రెసిపీలతోనే ‘దినసరి కీరై’ అనే స్టార్టప్​ మొదలైంది. తల్లి ప్రేమ వల్ల పుట్టిన ఈ స్టార్టప్​ వల్ల ఎంతోమంది బిడ్డలకు పౌష్టికాహారం అందుతోంది.

పుట్టిన వెంటనే బిడ్డను ఐసీయూలో మెషీన్ల బీప్​ శబ్దాల మధ్య చూస్తే.. ఏ తల్లి గుండైనా ఎలా తట్టుకుంటుంది. డాక్టర్లు బిడ్డను బతికించడం కష్టమని చెప్తే.. ఆ తల్లి ఎంత బాధపడుతుంది. అలాంటి పరిస్థితులనే లక్ష్మీ ప్రియ ఎదుర్కొంది. నెలలు నిండకుండానే పుట్టడం వల్ల కొన్ని గంటల్లోనే బాగా బరువు తగ్గాడు. రోగనిరోధక శక్తి బలహీనపడింది. అతని శరీరం రక్తాన్ని నిలుపుకోవడానికి ఇబ్బంది పడింది. బిడ్డను ఇంక్యుబేటర్లు, ట్యూబ్‌‌‌‌‌‌‌‌ల మధ్య ఉంచి ట్రీట్​మెంట్ అందించారు.

లక్ష్మిని కూడా దగ్గరకు రానివ్వలేదు. రోజూ దూరంగా నిలబడి కిటికీలో నుంచి చూస్తూ ఏడ్చేది. కానీ.. తన కొడుకుని ఆరోగ్యంగా చూడాలనే ఆ తల్లి అజేయమైన సంకల్పమే ఆ బిడ్డను బతికించిందేమో. ‘‘ఒకరోజు డాక్టర్ నన్ను పిలిచి బిడ్డని ఎత్తుకోమని చెప్పాడు. నా శరీరం నుండి వచ్చిన వేడి బిడ్డకు ఏదో విధంగా సాయపడింది అనుకుంటా. పల్స్ రేటు పెరగడం మొదలైంది. కొన్ని రోజుల్లోనే ఆరోగ్యం కుదుటపడింది. తర్వాత డిశ్చార్జ్​ చేశారు” అని గుర్తుచేసుకుంది లక్ష్మీ ప్రియ.

బలహీనమైన ఇమ్యూనిటీ, పోషకాహార లోపంతో బాధపడుతున్న కొడుకుని ఎలాగైనా పూర్తి ఆరోగ్యవంతుడిగా మార్చుకోవాలని లక్ష్మీ ప్రియ రకరకాల ప్రయత్నాలు చేసింది. చివరికి నేచురల్​ ఫుడ్స్​తోనే అది సాధ్యమవుతుందని నమ్మి ఆకు కూరలు తినిపించాలి అనుకుంది. కానీ.. చిన్నపిల్లలు ఆకుకూరలు తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. అందుకే కొడుకుకు నచ్చేవిధంగా వండేందుకు రకరకాల ప్రయోగాలు చేసి.. కొన్ని రెసిపీలు తయారుచేసింది.  వాటిని తిన్న తర్వాత ఆమె కొడుకు ఆరోగ్యం బాగుంది. ఇప్పుడు ఆటల్లో కూడా ఛాంపియన్‌‌‌‌‌‌‌‌గా రాణిస్తున్నాడు.

రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నాడు. దాంతో.. లక్ష్మీ తన కొడుకు పెరిగేకొద్దీ తన ఆకుకూరల రెసిపీలను అందరికీ పంచాలి అనుకుంది. తన కిచెన్​లో తయారుచేసిన ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ని మార్కెట్​లో అమ్మడం ప్రారంభించింది. అలా 2009లో ‘దినసరి కీరై’ అనే స్టార్టప్​ పుట్టింది. అందులో మనతక్కలి , కాసిని, ముదకథన్, అగతి కరిశలంగాన్నితోపాటు మొత్తం 15 రకాల రెసిపీలను మార్కెట్​లో అమ్ముతోంది. వాటిని తయారుచేయడానికి పాలకూరతోపాటు 40 రకాల ఆకుకూరలను వాడుతున్నారు. 

ఎలా చేస్తారంటే..  

ఆకుకూరల్లో ఆరోగ్యం దాగుందని పెద్దలు చెప్తుంటారు. అందుకే దక్షిణ భారత వంటకాల్లో ఆకుకూరలు ఎక్కువగా వాడుతుంటారు. అయినా.. పిల్లలు వాటిని తినడానికి పెద్దగా ఇంట్రెస్ట్‌‌‌‌‌‌‌‌ చూపించరు. అందుకే వాళ్లు ఇష్టంగా తినే ఇడ్లీలు, దోశెల్లో కలిపే విధంగా ఆకుకూరలతో పొడులను తయారుచేసింది లక్ష్మి. వాటిలో కొన్ని పొడులను సూప్‌‌‌‌‌‌‌‌లు, రైస్​లో కూడా కలుపుకోవచ్చు. వాటిని ఎలాచేస్తారంటే ముందుగా కావాల్సిన ఆకుకూరలను తీసుకొస్తారు. ఎటువంటి కీటకాలు, మట్టి లేకుండా చేతితో శుభ్రం చేస్తారు. ఆ తర్వాత బాగా ఉడికించి, ఎండబెట్టి పొడులు చేస్తారు. ఆ పొడుల్లో రకరకాల పప్పుధాన్యాల పొడులను కలుపుతారు. 

లక్ష్మీ ప్రియది తమిళనాడులోని తిరుచిరాపల్లికి దగ్గర్లోని కె.కె. నగర్. ఈ ప్రాంతంలో చాలామంది రైతులు ఆకుకూరలు పండిస్తుంటారు. వాళ్లలో ఆర్గానిక్​ పద్ధతుల్లో పండించే 15 మంది రైతుల నుంచి ప్రియ ఆకుకూరలను సేకరిస్తుంది. ఆ పొడులు తినేది పిల్లలు కాబట్టి తయారీలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. రైతులు వాడేందుకు సేంద్రియ ఎరువులు, విత్తనాలు కూడా తానే ఇస్తుంది.

దాదాపు 18 రకాల ఆకుకూరలను హైడ్రో పోనిక్స్​ విధానంలో పండిస్తున్నారు. ఆకుకూరల్లోని పోషకాల గురించి, వాటి వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో లక్ష్మి స్థానిక పాఠశాలలు, కళాశాలల్లో వర్క్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌లు నిర్వహిస్తోంది. సంప్రదాయ ఆకుకూరల్లో దాగిన లాభాల గురించి అవగాహన కల్పిస్తోంది. 

కష్టాలు తప్పలేదు

లక్ష్మి వ్యాపార ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. మొదట్లో చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ప్రాసెసింగ్​లో ఆకుకూరల్లోని పోషకాలు బయటికి వెళ్లకుండా మెయింటెయిన్​ చేయడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. అందుకోసం నిరంతరం కొత్త పద్ధతులు వెతకాల్సి వచ్చింది. అందులో భాగంగానే సోలార్​ డ్రయ్యింగ్​ ప్లాంట్​ని ఏర్పాటు చేసుకుంది.

ప్రాసెసింగ్​లో పూర్తిగా ఐఎస్​వో సర్టిఫైడ్ పద్ధతులనే అవలంబిస్తున్నారు. ప్రస్తుతం సంవత్సరానికి రూ. 9 లక్షలకుపైగా లాభాలు వస్తున్నాయి. గడిచిన రెండు సంవత్సరాల్లో ఆమె దగ్గర 5,000 మంది ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ కొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా, సింగపూర్ నుంచి ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. 

సమయం ఆదా అవుతోంది

బెంగళూరులో ఉంటున్న ప్రీతి..  సంవత్సరం నుంచి దినసరి కీరైకి రెగ్యులర్ కస్టమర్‌‌‌‌‌‌‌‌గా ఉంది. తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ “దినసరి కీరై ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ వల్ల నాకు చాలా టైం ఆదా అవుతుంది. కొన్ని రకాల ఆకుకూరలు వండడానికి చాలా టైం పడుతుంది. కానీ.. అలాంటివాటిని కూడా చిటికెలో వండుకునే విధంగా మారుస్తున్నారు.

నా బిడ్డకు దినసరి కీరై పొడులంటే చాలా ఇష్టం. నేను వాళ్ల రైస్ మిక్స్ పౌడర్లు కూడా ప్రయత్నించా. అవి కూడా చాలా బాగున్నాయి. అవి నాకు ఎసిడిటీ, అల్సర్​ తగ్గడానికి చాలా హెల్ప్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. తుత్తువలై సూప్ జలుబు, గొంతు నొప్పులకు మందులా పనిచేస్తుంది” ” అంటూ చెప్పుకొచ్చింది.