ట్రైకార్ యూనిట్లు గ్రౌండింగ్ ​చేస్తలే.. మూడేండ్లుగా 191 మంది ఆదివాసీలకే లబ్ధి

2020–21కి సంబంధించి ఇంకా 684 మందికి ఇవ్వాలి
అధికారులు, బ్యాంకర్ల నిర్లక్ష్యంతో అందని సబ్సిడీ రుణాలు 

భద్రాచలం, వెలుగు: ఆదివాసీలకు ఉపాధి కల్పించేందుకు, ఆర్థిక చేయూత అందించేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ తీసుకొచ్చిన ట్రైకార్(తెలంగాణ షెడ్యూల్డ్ ట్రైబల్ కో– ఆపరేటివ్ ఫైనాన్స్) పథకం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నీరుగారుతోంది. అధికారులు, బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా లబ్ధిదారులకు అందడం లేదు. 2020 – 21లో మొత్తం 875 యూనిట్లను గ్రౌండింగ్​చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూ.7కోట్ల40లక్షల34వేలు మంజూరు చేసింది. అయితే మూడేండ్లుగా ఆ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు కేవలం జిల్లాలోని అయిదు నియోజకవర్గాల పరిధిలో 191 యూనిట్లను మాత్రమే గ్రౌండింగ్​చేశారు. ఇంకా 684 యూనిట్లను చేయాల్సి ఉంది. ఎంపీడీఓల ఆధ్వర్యంలో మేళాలు పెడుతున్నాం.. త్వరలోనే అందిస్తామని అధికారులు చెబుతున్నారే తప్ప పట్టించుకోవడం లేదు. 

బ్యాంకు అకౌంట్ల దగ్గరే ఆగింది

ట్రైకార్ పథకం లబ్ధిదారుల ఎంపికలో ప్రధానమైనది బ్యాంకు అకౌంట్. ఎంపికైన లబ్ధిదారుడితో సమీపంలోని బ్యాంకులో అకౌంట్​ఓపెన్ చేయించాలి. బ్యాంకు ఇచ్చే రుణంలో ట్రైకార్​కింద యూనిట్ కాస్టును బట్టి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు సబ్సిడీ వస్తుంది. కానీ అధికారులు, బ్యాంకర్ల నిర్లక్ష్యం, లబ్ధిదారుల అవగాహనా రాహిత్యంతో మూడేండ్లుగా ప్రభుత్వ సాయం పొందలేకపోతున్నారు. జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉండగా, 2020–-21ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు అశ్వారావుపేటలో 72, భద్రాచలంలో 28, కొత్తగూడెంలో 31, పినపాక 13, ఇల్లందు 47 యూనిట్లను మాత్రమే గ్రౌండింగ్​చేశారు. మొత్తం 191మంది మాత్రమే ట్రైకార్​ద్వారా లబ్ధి పొందారు. ఇంకా 684 మంది ఈ పథకం కోసం ఎదురుచూస్తున్నారు. దుమ్ముగూడెం మండలంలో 72 మందికి గాను ఇప్పటిరకు 20 మందికి మాత్రమే నాన్​ఆపరేటివ్ అకౌంట్లు ఉన్నాయి. ఇవి ఉంటే ట్రైకార్ సబ్సిడీతోపాటు బ్యాంకు రుణం వస్తుంది. బ్యాంకులకు వెళ్లాలని తెలియకపోవడం, వెళ్లినోళ్లను బ్యాంకర్లు పట్టించుకోకపోవడంతో గ్రౌండింగ్​ప్రాసెస్​కొనసాగుతూనే ఉంది. ఎంపికైన వారికి ఫ్యాన్సీ స్టోర్, టెంట్ హౌస్, బోర్ వెల్స్, ఆయిల్ ఇంజన్లు, ఇతరత్రా యూనిట్లు ఇవ్వాలని నిర్ణయించారు.

ALSO READ :హైదరాబాద్‌‌ నుంచి .. అమెరికాకు ఫ్లైట్‌‌ నడపండి

పైరవీకారుల జోరు

మరోవైపు ఈ పథకానికి పైరవీకారుల గ్రహణం పట్టింది. ఆయా మండలాల్లో యూనిట్​మంజూరుకు రూ.15 వేలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల లక్ష్మీదేవిపల్లి మండలంలో పైరవీకారులు డబ్బులు డిమాండ్​చేయగా లబ్ధిదారులు స్థానిక ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ లీడర్ల పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది.

గ్రౌండింగ్​ మేళాలు పెడతాం

2020 – 21ఆర్థిక సంవత్సరంలో 340 యూనిట్లకు గాను రూ.3 కోట్లు వచ్చాయి. వీటి కోసం మండలాల వారీగా గ్రౌండింగ్​ మేళాలు పెడతాం. ఎంపీడీఓల ఆధ్వర్యంలో ఎంపిక చేసి, లబ్ధిదారులకు యూనిట్లు అందజేస్తాం. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 

సురేష్​బాబు, ఎస్ఓ, ఐటీడీఏ

ఇంత ఆలస్యం చేస్తే ఎలా? 

ట్రైకార్ యూనిట్ల గ్రౌండింగ్​విషయంలో చాలా ఆలస్యం జరుగుతోంది. అధికారులు ఇలా వ్యవహరించడం కరెక్ట్​కాదు. ఆదివాసీలకు ఆర్థిక చేదోడు అందించేందుకు తెచ్చిన పథకాన్ని నీరుగార్చొద్దు. మూడేళ్ల కింద వచ్చిన నిధులు ఖర్చు చేయడానికి ఐటీడీఏ మీనమేషాలు లెక్కించడం దారుణం. 

 కారం పుల్లయ్య, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు